తలమడుగు, మే 2 : అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పా రు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 2800 ఎకరాలల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. పంటల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాలని, సర్వేను వేగవంతం చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. డీఏవో పుల్లయ్య, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, ఎంపీపీ కల్యాణలక్ష్మి రాజేశ్వర్, తహసీల్దార్ వనజ, సర్పంచ్ భగీరథబాయి, ఆత్మ డైరెక్టర్ శాస్త్రి, రైతులు సంపత్, మల్లేశ్, కేదారేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
పనులను వెంటనే ప్రారంభించాలి
ఆర్అండ్బీ ద్వారా చేపట్టే పనులను వెంటనే ప్రారంభించాలి కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆర్అండ్బీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడారు. ఆదిలాబాద్‌లో అండర్, ఓవర్ రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి రూ.97.2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. తెలిపారు. తాంసి బస్‌స్టాండ్ వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జి, ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. భూ సేకరణ, పుట్‌పాత్ నిర్మాణం వంటి పనులను చేపట్టేందుకు రెవెన్యూ ,మున్సిపల్ , రోడ్డు భవనాలు, రైల్వే అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి రూ.55కోట్ల పరిపాలన అనుమతులు మంజూరైనట్లు వెల్లడించారు.కేఆర్కే కాలనీ, మావల సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించనున్న నేపథ్యంలో మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంరెడ్డి రాజేశ్వర్, ఇతర అధికారులు ఉన్నారు.