ఎదులాపురం, మే 15 : ట్రాన్స్జెండర్ల సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ అధికారి మిల్కా అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో గురువారం ట్రాన్స్‌జెండర్స్‌తో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మిల్కా మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌జెండర్ కార్డు ఇప్పటివరకు తీసుకోని వారు తప్పక తీసుకోవాలన్నారు. రిమ్స్‌లో మైత్రీ క్లినిక్ ఏర్పాటు చేశామని, ప్రతి మంగళ, గురువారాల్లో సేవలు ఉపయోగించుకోవాలన్నారు.
డ్రాపౌట్ అయిన వారు చదువుకోవాలని, ఇష్టం ఉన్నవారికి ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ట్రాన్స్‌జెండర్స్ కామేశ్వరి, అలిజా, హర్షిత, కావ్య, మైత్రి క్లినిక్ కౌన్సిలర్ లావణ్య, జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్ యశోద పాల్గొన్నారు.