కాగజ్‌నగర్ /సీసీసీ నస్పూర్ /ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 1 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకోబోమంటూ వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. భూముల వేలంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ నాయకులు దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ హెచ్‌సీయూ భూములను కాపాడాలని పోరాడితే తమ సంఘం నాయకులను అక్రమంగా అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్, జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు భీమేశ్, తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీపీఎం నాయకులు దహనం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా ఆక్రమించుకుంటున్నారనీ, చివరికి విద్యాసంస్థల భూములను కూడా వదలడం లేదని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూములను కాపాడాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్‌లో సీపీఎం నాయకుల అరెస్ట్
హెచ్‌సీయూలో భూముల వేలానికి నిరసనగా సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం హైదరాబాద్‌లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో నస్పూర్‌లో ఆ పార్టీ నాయకులు మిడివెల్లి రాజ్‌కుమార్, పాయిరాల రాము లు, సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపి ప్రజాపాలనపై దృష్టిసారించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.