“గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడింది. ఆర్థిక భారాన్ని మోయడం మాతోకాదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదన అనుభవిస్తున్నం. పారిశుధ్య ట్రాక్టర్ల డీజిల్‌తోపాటు ఇతర ఖర్చులకు అప్పులు తీసుకురావాల్సి వస్తున్నది. ఇప్పుడు అప్పు ఎవ్వరూ ఇవ్వడం లేదు.” ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఏ పంచాయతీ కార్యదర్శిని కదిలించినా వినిపిస్తున్న మాటలు. పంచాయతీల నిర్వహణ మాతో కాదంటూ కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లను నడపలేమని తాళాలు తీసుకొచ్చి మండల పంచాయతీ అధికారులకు అప్పగిస్తున్నారు. మొన్నటికి మొన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోను కలిసి ట్రాక్టర్ల తాళాలు ఇచ్చారు. మరుసటి రోజే మంచిర్యాల జిల్లా చెన్నూర్ రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలు తెచ్చి ఎంపీవోకు అప్పగించారు. నిర్మల్ జిల్లాలో కూడా ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీవోలకు అప్పగించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులు గుర్రుగా ఉన్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎవరిని కదిలించినా కష్టాల చిట్టాను కథలు కథలుగా చెప్తున్నారు.
– మంచిర్యాల, జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధిపథంలో దూసుకుపోయాయి. కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పాతగోడలు, పాడుబడ్డ భవనాలు, అధ్వానపు రోడ్లతో అవస్థల్లో ఉన్న గ్రామాల దిశాదశ ఒక్కసారిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్ని ఇస్తే, దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. ఒక్కో వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.160 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.160 చొప్పున.. అంటే ఒక్కో వ్యక్తి పేరిట నెలకు రూ.320 ఎంత మంది జనాభా ఉంటే అంత మొత్తం విడుదల చేశారు. కేసీఆర్ సర్కారు ప్రతి నెల పంచాయతీలకు రూ.275 కోట్లు, ఏడాదికి రూ.3,330 కోట్లు విడుదల చేసింది. దీంతో గ్రామాలకు నిధుల వరద పారింది.
పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణకు గ్రామానికి ట్రాక్టర్, చెత్త సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికలు, హరితహారం కింద మొక్కల పెంపకం ఇలా గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2024లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా రాలేదు. పంచాయతీల్లో పాలకవర్గాల సమయం ముగిసిపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అటు కేంద్రం నిధులు రాక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక గ్రామాల్లో అభివృద్ధి స్తంభించింది. గతంలో కేసీఆర్ సర్కారు చేసిన పనులను కూడా కొనసాగించే పరిస్థితి లేదు. పాలకవర్గాలు లేని సమయంలో ఆలాన పాలన చూడాల్సిన రాష్ట్ర సర్కారు చేతులెత్తేసింది. దీంతో గ్రామాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, చెత్త సేకరణ ట్రాక్టర్లు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికల నిర్వహణ కష్టంగా మారింది.
నిధులు లేక సుస్తి పట్టిన గ్రామాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులపైనే వదిలేసింది. ‘మీరు గతంలో బాగా పని చేశారు. కాంగ్రెస్ వచ్చాకే పని చేయడం లేదు. మీరు ఏం చేస్తారో తెలియదు. పల్లెల్లో పనులు ఆగొద్దు. పనులు చేసి బిల్లులు పెట్టుకోండి. డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవచ్చు..’ అని కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీంతో చాలా రోజులుగా పంచాయతీల నిర్వహణ కోసం కార్యదర్శులు అప్పులు తెచ్చి నడిపిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్లకు ఉద్దేరకు డీజిల్ పోయిస్తూ.. అప్పులు తెచ్చి పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ర్టాల నుంచి వచ్చే నిధుల్లో 20 శాతం శానిటేషన్‌కు, 5 శాతం గ్రీన్ మేనేజ్మెంట్కు, 2 శాతం నిధులు ఇతర ఖర్చులకు వాడుకునేవారు. ఇప్పుడు వీటికి ప్రత్యేక నిధులు రావడం లేదు. పారిశుధ్య పనులు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న సర్కారు.. ఫండ్స్ మాత్రం ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటి, వాటి నిర్వహణకు వచ్చే ఫండ్స్‌తో ట్రాక్టర్లు నడిపించాలని ఉన్నతాధికారులు చెప్తున్నారట. గత సర్కారులో రోజూ ట్రాక్టర్లు తీశారని, ఇప్పుడు వారానికి ఒకసారైనా తీయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని కార్యదర్శులు వాపోతున్నారు. వచ్చిన జీతం పంచాయతీలో పెట్టుబడులు పెట్టడానికే పోతుందంటున్నారు. స్ట్రీట్‌లైట్లు మార్చడానికి మా జేబుల్లో నుంచే ఖర్చు పెడుతున్నామంటున్నారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎక్కువయ్యాయి. అంతకుముందు గ్రామాల్లో ఉన్న మల్టీ పర్పస్ వర్కర్లను కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉద్యోగులుగా చూపిస్తూ.. కేంద్రం నుంచి వచ్చే జీతాలనే మల్టీ పర్పస్ వర్కర్లకు ఇస్తున్నారు. దీంతో మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సమస్యలపై పంచాయతీ కార్యదర్శులనే బాధ్యులను చేస్తున్నారు.
ఎక్కడ పైల్‌లైన్ లీకేజీ జరిగినా, ఎక్కడ బోర్ పనిచేయకపోయిన ఆ పనులు మాకే చెప్తున్నారంటూ వాపోతున్నారు. బోర్లు బాగు చేయించడానికి చందాలు సేకరించాల్సిన దుస్థితి నేడు పల్లెలో ఉందంటున్నారు. నిధులు లేకుండా ట్రాక్టర్లు నడపమంటే, డబ్బులు లేకుండా పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు నడపమంటే ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
18 నెలలుగా నిధులు లేకుండా గ్రామ పంచాయతీల ఆలనాపాలనా చూసుకుంటూ వచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఇక మాతో కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేమని, లక్షల్లో అప్పులు తెచ్చి పంచాయతీలను నడపలేం అంటూ తిరగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్లు తాళాలు వేసి మండలాధికారులకు అప్పగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా పలు మండలాల్లో కార్యదర్శులు ఇలాగే ట్రాక్టర్ల తాళాలు ఎంపీడీవోలకు, ఎంపీవోలకు సరెండర్ చేశారు. గ్రామాల్లో ఆర్థిక పరమైన పనులు ఇకపై చేయబోమని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.