ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలకు జలకళ ఉట్టిపడుతున్నది. స్థానికంగా వర్షం కురుస్తుండడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలపాతాలు పోటెత్తుతున్నాయి. కుంటాల జలపాతంలోకి కడెం నుంచి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతుండడంతో జలపాతం కళకళలాడుతున్నది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో సాసర్కుండ్ పరవళ్తు తొక్కుతున్నది. జలపాతం నిండుగా పారుతుండడంతో మహారాష్ట్రతోపాటు తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు అందాలను వీక్షిస్తున్నారు.
సెల్ ఫోన్లలో ఫొటోలను నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇచ్చోడ మండలంలోని గాయత్రి మెడిగూడకు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న గాయత్రి జలపాతం సుమారు 250 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. జలపాతం నిండుగా పారుతుండడంతో చూపరులను ఆకట్టుకుంటున్నది. భీంపూర్ మండలంలోని గుంజాల సమీప చిరు జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటున్నది. మహారాష్ట్ర నుంచి ప్రవహించే వాగు ధనోరా మీదుగా ఇలా గుంజాల గుండా పెన్గంగకు వెళ్తున్నది. గుంజాల జలపాతం చూడడానికి సెలవు దినాలలో సందర్శకులు వస్తున్నారు. దీనిని టూరిజం కేంద్రంగా గుర్తించాలని ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపారు.