సారంగాపూర్, ఫిబ్రవరి 8 : గ్రామీణులకు ఆహ్లాదాన్ని పంచేందుకు కేసీఆర్ సర్కారు పల్లె ప్రకృతి వనాలు, బృహత్తర పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఔషధ, పూల మొక్కలను నాటింది. పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, భావితరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన వనాలు నేడు కళ తప్పాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో పొదలు, పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
మరికొన్ని గ్రామాల్లో అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు మందుబాబులకు అడ్డాగా.. రాత్రి పేకాట స్థావరాలుగా మారాయి. ఈ వనాలను సందర్శిస్తే మందుబాటిల్స్, వాటర్ బాటిల్స్, అంబర్ ప్యాకెట్లు, గుట్కాలు, పేక ముక్కలు దర్శినమిస్తున్నాయి. అలాగే మధ్యాహ్న వేళల్లో పశువులు సేదతీర్చుకునేందుకు అవాసంగా ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి ఏపీవో పోశెట్టిని వివరణ కోరగా.. జౌళి బృహత్తర పల్లె ప్రకృతి వనం పెన్సింగ్ లేకపోవడంతోనే అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని అన్నారు.

