దండేపల్లి, జనవరి 3: దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం నుంచి ఈనెల 6న నీటిని విడుదల చేయనున్నారు. జిల్లా కేంద్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నీరందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే చాలా మంది రైతులు వాగులు, చెరువులు, వ్యవసాయ బావుల కింద నాట్లు వేస్తున్నారు. ఎల్లంపెల్లి జలాశయం బ్యాక్ వాటర్‌ను గూడెం ఎత్తిపోతల నుంచి విడుదల చేయడంపై స్పష్టత రాకపోవడంతో చాలా చోట్ల రైతులు నార్లు పోసుకొని సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. అధికారుల ప్రకటనతో ఇక పనులు ఊపందుకోనున్నాయి. హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల పరిధిలోని రైతులకు మేలు చేకూరనున్నది.
ఎల్లంపెల్లి జలాశయం బ్యాక్ వాటర్‌ను గూడెం ఎత్తిపోతల ద్వారా కడెం 30వ డిస్ట్రిబ్యూటరీ కాలువ వద్ద వదులుతున్నారు. హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు ప్రతి యేటా అందిస్తున్నారు. కొత్తగా వేసిన పైపులతో రెండు సార్లు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎల్లంపెల్లి జలాశయం 148 మీటర్ల పూర్తి సామర్థ్యానికి 145.98 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇది 137.6 మీటర్లకు తగ్గితే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరో తేదీ నుంచి 90 రోజుల పాటు మొత్తం రెండు టీఎంసీల నీటిని అందించాలని నిర్ణయించారు.
గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి యేటా 30వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతున్నది. ఎల్లంపెల్లి జలాశయ నిల్వ నీటిని(బ్యాక్ వాటర్)గూడెం సమీపంలోని గోదావరి తీరాన నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగికి నీటిని అందిస్తున్నారు. గూడెం ఎత్తిపోతల పథకం నీటిని మండలంలోని తానిమడుగు సమీపంలోని కడెం ప్రధాన కాల్వలో 30వ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కిందికి 42 కాల్వ వరకు దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.
ఈనెల 6 నుంచి గూడెం ఎత్తిపోతల ద్వారా ఎల్లంపెల్లి నీటిని యాసంగి సాగుకు విడుదల చేయనున్నాం. నీటి మట్టం గతేడాది కంటే ఈసారి ఎల్లంపెల్లి జలాశయంలో తక్కువగా ఉన్నందునా, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. 90 రోజుల పాటు రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తాం. రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటేశ్వర్లు, డీఈఈ, లక్షెట్టిపేట సబ్ డివిజన్