కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కుమ్రం భీం ప్రాజెక్టు అడుగంటిపోతున్నది. 45,500 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సామర్థ్యం 10 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఎండలు మరింత ముదిరితే డెడ్‌స్టోరేజీకి చేరుకునే అవకాశముండగా, తాగు నీటికి సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నది.
ఇక ఎండలు ముదిరితే అంతే..
కుమ్రం భీం (అడ) ప్రాజెక్టును 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టీ నియోజవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో ప్రాజెక్టులో రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఎండలు మరింత ముదిరితే నీటి నిల్వలు మరింత తగ్గే అవకాశముండగా, తాగు నీటికి సైతం ఇబ్బందులు తలెత్తే ప్రమాదమున్నది. మూడేళ్లు క్రితం ప్రాజెక్టు కట్టకు పగుళ్లు తేలడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలను అధికారులు తగ్గించారు.
ప్రాజెక్టు మనుగడకే ముప్పు
జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టుగా పేరున్న కుమ్రం భీం ప్రాజెక్టు (ఆడ ప్రాజెక్ట్)కు ఈ ఏడాది కూడా మరమ్మతులు చేయకపోవడంతో నీటి సామర్థ్యాన్ని తగ్గించాల్సి వస్తున్నది. మూడేళ్లుగా కట్టకు ఏర్పడిన పగుళ్లు పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాకాలంలో ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోకుండా.. వర్షపు నీరు నేరుగా కట్టపై పడకుండా పాలిథిన్ కవర్లు కప్పి ఉంచుతున్నారు. కానీ, ప్రాజెక్టు కట్టకు సన్నగామొదలైన పగుళ్లు.. క్రమంగా పెద్ద బీటలుగా మారుతున్నాయి. కట్టపై వేసిన తారు రోడ్డుకు సైతం బీటలు వస్తుండటం, కట్టకు రక్షణగా నిర్మించిన సైడ్ వాల్స్ వరద తాకిడికి ధ్వంసం కావడంతో క్రమంగా కట్ట బలహీనంగా మారుతున్నది. ప్రభుత్వం మాత్రం మరమ్మతుల కోసం నిధులు కేటాయించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశమున్నది. ఈ ప్రాజెక్టు ఎంతోకాలం నిలువదేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.
నివేదికలు పంపినా..!
అడ ప్రాజెక్ట్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు మరమ్మతులకు రూ. 5 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఎలాంటి స్పందన రావడం లేదు. గత వానకాలంలో ప్రాజెక్టులోకి వరద రాగా, ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తి వదిలేయడం వల్ల ఆనకట్ట తాత్కాలికంగా నిలిచింది. కట్ట మట్టి కొట్టుకుపోకుండా ప్లాస్టిక్ కవర్లు కప్పి అధికారులు రక్షించే చర్యలు తీసుకున్నారు. కానీ.. రోజులు గడిచిన కొద్దీ కట్ట కుంగిపోతూనే ఉన్నది. వచ్చే వానకాలం నాటికి ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
డెడ్‌స్టోరేజీకి..!
అడ ప్రాజెక్టు మరమ్మతులకు సర్కారు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతున్నది. ఇక ప్రాజెక్టు కట్ట కూలిపోతే నీటిని నిల్వ చేసే అవకాశాలు తక్కువ.. ఇక అప్పుడు పంటలు సాగు చేయడం కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండగా.. మరికొన్ని రోజుల్లో ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరుకునే అవకాశమున్నది. అదే జరిగితే ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.