మంచిర్యాల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో కల్పతరువులా ఉన్న ‘శ్రీపాద ఎల్లంపల్లి’లో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గిపోతుండగా, కలవరం మొదలైంది. నీటి సరఫరా ఇలాగే కొనసాగితే నెలన్నరలో ప్రాజెక్టు అడుగంటి పోయి, మంచిర్యాలతో పాటు పెద్దపల్లి, హైదరాబాద్‌కు తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదమున్నది. ఈ విషయమై రెండు రోజుల క్రితం ‘డేంజర్ బెల్స్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించగా, సిబ్బంది ఔట్‌ఫ్లోను కాస్త తగ్గించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
తాగు నీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవా..!
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మొత్తం కెపాసిటీ 20.1754 టీఎంసీలు(148 మీటర్లు) కాగా, గురువారం నాటికి 10.4707 టీఎంసీల(143.88 మీటర్ల) నీరు ఉన్నది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ స్కీమ్‌కు 311 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, వేమునూరు పంప్‌హౌస్‌కు 247 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఇది కాకుండా మిషన్‌భగీరథ స్కీమ్ కింద రామగుండం గ్రిడ్‌కు, మంచిర్యాల గ్రిడ్‌కు కలిపి 80 క్యూసెక్కుల దాకా నీరు అవసరం అవుతున్నది.
పంటలు కోత దశలో ఉన్న నేపథ్యంలో గూడెం పంప్‌హౌస్‌కు 290 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. వీటన్నింటికీ ఇలాగే నీటిని సరఫరా చేస్తే నెలన్నర రోజుల్లోనే ఎల్లంపల్లి అడుగండిపోయి మంచిర్యాలతో పాటు అటు పెద్దపల్లి ముఖ్యంగా హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ అంశపై ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజులు క్రితం కథనం ప్రచురించిన నేపథ్యంలో ఔట్‌ఫ్లోను కాస్త తగ్గించారు. గురువారం ఎన్టీపీసీకి, నందీ పంప్‌హౌస్‌లకు నీటి సరఫరా చేయలేదని అధికారులు గణాంకాల్లో చూపించారు.
గూడెంలిఫ్ట్ ఇంకా కొన్ని రోజులు నడిస్తే కష్టమే…
కడెం ప్రాజెక్ట్ పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలనేది నిబంధన. దీని కింద దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో 18 టీఎంసీల నీరు ఉంటేనే గూడెం లిఫ్ట్‌ను నడపాలి. కానీ, గత రెండు సంవత్సరాలు ఎండాకాలం ప్రారంభానికి ముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీరు 18 టీఎంసీల కంటే దిగువకు చేరుతున్నది. స్థానిక రైతుల డిమాండ్ మేరకు 15 వేల ఎకరాల ఆరుతడి పంటలకు నీరు ఇస్తున్నారు.
ఈ మేరకు ఇప్పటికీ గూడెం లిఫ్ట్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. గూడెం నుంచి 290 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మరికొన్ని రోజుల్లో పంటలు కోతకు వచ్చే దశలో ఉన్నాయి. ఇప్పటికీ గూడెంకు ఎల్లంపల్లి నుంచి నీటిని ఇస్తున్నారు. గూడెం లిఫ్ట్‌ను అలాగే నడిపిస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పేవనే అంచనాలు వినిపిస్తున్నాయి. గతేడాది, అంతకు ముందు ఏడాది దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు మంచిర్యాలకు తాగునీటి ఇబ్బందుల రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి ప్రత్యేక కాలువలు తీసి పంప్‌హౌస్‌కు నీటి కొరత లేకుండా చూశారు. కానీ, ఈ సారి అలాంటి చర్యలు ఏవీ కనిపించకపోవడం ఆందోళనకరంగా మారింది.
కాళేశ్వరం ఉంటే ఈ పరిస్థితి ఉండేనా..
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోని దాదాపు 330 గ్రామ పంచాయతీలు, మరో 20 తండాలు, గూడేలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచే తాగునీరు సరఫరా అవుతున్నది. జిల్లాలో ప్రతి రోజూ 6.75 ఎంఎల్డీ నీరు అంటే 0.09 టీఎంసీలు తాగడానికి కావాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం దాకా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పుష్కలమైన నీరు ఉండేది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుకునే అవకాశం ఉండడంతో ఎల్లంపల్లిలోకి నీరు ఎత్తిపోసి సాగు, తాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా వాడుకునే వీలుండేది.
కాళేశ్వరంలో ఎత్తిపోస్తే ఎల్లంపల్లి నిండుకుండలా మారిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడంతో ఎల్లంపల్లి ఎండాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో మూడేళ్ల క్రితం ఇదే సమయానికి బెడ్ లెవల్ నీటితో నిండుకుండను తలపించిన ఎల్లంపల్లి రోజురోజుకూ అడుగంటిపోతున్నది. ఎండల తీవ్రత ఇలాగే ఉండి, రోజూ ఇదే తరహాలో నీటిని తరలించాల్సి వస్తే మరో నెలన్నర రోజుల్లోనే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల పట్టణాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోని మంచిర్యాల మిషన్ భగీరథ పంప్‌హౌజ్ ఉన్న ప్రాంతంలో ఇప్పటికే నీరు అడుగంటిపోయి కనిపిస్తున్నాయి.
గతేడాది కంటే మెరుగైన పరిస్థితి
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి నిల్వలపై ఎల్లంపల్లి డీఈ బుచ్చిబాబును వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న నిల్వలు జూలై దాకా సరిపోతాయన్నారు. గతేడాది ఈ సమయంతో పోలిస్తే ఈ ఏడాది రెండు టీఎంసీల నీరు అధికంగా ఉందన్నారు. యేటా ప్రాజెక్ట్‌లో ఉండే నీటి కంటే ఎక్కువ నిల్వలు ఉన్నందున సమస్య వచ్చ అవకాశాలే లేవన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
– బుచ్చిబాబు, డీఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్