ఆదిలాబాద్, మే 22 ( నమస్తే తెలంగాణ) : జొన్నలు విక్రయించేందుకు గోస పడుతున్న రైతులను పట్టించుకోరా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డుకు వెళ్లి పంటల విక్రయాల్లో పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటను మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చి 11 రోజులవుతుందని, జొన్నలను కాంటా చేసి, సంచుల్లో నింపినా అధికారులు తక్‌పట్టీలు ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. పంటను లారీల్లో లోడ్ చేసేంత వరకూ రైతులదే బాధ్యత అని చెప్పడంతో పంట విక్రయానికి అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. జిల్లా కేంద్రంలోని రెండు మార్కెట్ యార్డుల్లో 65 వేల జొన్న సంచులున్నాయని, లారీలు, హమాలీలు గోదాం ఖాళీ లేని కారణంగా సంచులు రవాణా కావడం లేదన్నారు. వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నా నేలపై నుంచి వస్తున్న వరదనీటి కారణంగా పంట తడిసిపోయి రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
రైతుల పంటను కాంటా చేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తక్‌పట్టీలు ఇవ్వాలని కలెక్టర్ సూచించినా మార్కెట్‌యార్డులో మాత్రం హమాలీల చిట్టీలపై సంచుల వివరాలు రాస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను లారీల్లో లోడ్ చేసిన తర్వాత తక్‌పట్టీలు ఇస్తామని సిబ్బంది అంటున్నారని దీంతో రైతులు 11 రోజులుగా పంటకు కాపలాగా ఉండాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పంట కొనుగోళ్ల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అంటున్నారని, కేంద్రం పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచిస్తుందన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి రైతులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. జొన్న రైతులు పంట అమ్మకాల్లో తిప్పలు పడుతుంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో గోదాములు చూశానని చెప్పడం సరికాదన్నారు. రాజకీయాలకు పక్కన పెట్టి పంట కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలు కొనుగోలు చేసేంత వరకూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజ్జిగిరి నారాయణ, సెవ్వ జగదీశ్, రాజు పటేల్, అశోక్, రమణ, స్వామి, భూమన్న తదితరులున్నారు.
భీంపూర్, మే 22: స్థానిక రైతులు ఇక్కడ జొన్నలు అమ్ముకోవడంలో జాప్యం దృష్ట్యా మహారాష్ట్రలోని ఘాటం జి, సార్ఖని, యావత్మాల్లకు వెళ్లి ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలు రూ. 2,400-2,800 వరకు నష్టానికే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్లో మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,020 ఉన్నా కొనుగోళ్లలో జాప్యం, తదితర కారణాలతో రైతులు మహారాష్ట్ర వైపే మొగ్గు చూపుతున్నారని తె లుస్తున్నది. పంట పెట్టుబడికి రైతుభరోసా ఇంకా అందకపోవ డం, జొన్న పంట అమ్మినా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావటానికి జాప్యం జరగడం, సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.