నిర్మల్ టౌన్, అక్టోబర్ 4: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతల పాట్లు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతను ఎన్నికల కమిషన్ గుర్తించి, ప్రతీ ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధ్దంగా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకునేలా ఎప్పటికప్పుడు సంస్కరణల పేరుతో మార్పులు తెస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సారి జరుగబోయే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, నడువలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతున్నది. అందుకు ఎన్నికల కమిషన్ ప్రతీ పోలింగ్ కేంద్రంలో వారం ముందుగానే డీ-12 ఫారం అందుబాటులోకి తెచ్చింది. వారు ముందుగానే దరఖాస్తు సమర్పించుకుంటే బీఎల్వో ఓటు వేసుకునేందుకు ఎన్నికల అధికారికి సిఫార్సు చేయనున్నారు. ఈ పక్రియపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో వారికి ఓటు వేసేందుకు సదరు రాజకీయ పార్టీల నేతలు ఎడ్లబండ్లు, బైకులపైన గానీ, భుజాన గానీ మోసుకొచ్చేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండా నేరుగా ఇంటి వద్దనే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటు హక్కు నమోదు చేసుకొని, ఎన్నిక రోజు ఎన్నికల అధికారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది.
లక్షకు పైగా వయోవృద్ధులు, దివ్యాంగులు..
నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహిస్తున్నది. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఎన్నికల కమిషన్, ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కరపత్రాలు, ప్రచార పోస్టర్లు, స్టిక్కర్లు, సీడీలు, అవగాహన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో మొత్తం 7,11,190 మంది ఓటర్లున్నారు. ఇందదులో 3,66,683 మంది మహిళలు, 3,44,458 మంది పురుషులు, ఇతరులు 49 మంది ఉన్నట్లు అధికారులు జాబితాను విడుదల చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,47,495 మంది (1,29,914 మంది మహిళలు, 1,17,563 మంది పురుషులు, ఇతరులు 18).., ఖానాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్స్టేషన్ల పరిధిలో 2,17,665 మంది (1,10,667 మంది మహిళలు, 1,06,985 మంది పురుషులు, ఇతరులు 13 మంది).., ముథోల్ నియోజకవర్గంలో 311 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,46,030 మంది (1,26,102 మంది మహిళలు, 1,19,910 మంది పురుషులు, ఇతరులు 18 మంది) ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 80 ఏండ్లు నిండిన, దివ్యాంగులు లక్షకు పైగానే ఉండడంతో వీరందరికీ డీ-12 ఓటు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.
జిలా ్లస్థాయిలో కమిటీలు..
80 ఏండ్లు నిండిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇవ్వడంతో జిల్లాస్థాయిలో ఓటు విధానంపై కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 906 పోలింగ్ కేంద్రాలుండగా, వాటి పరిధిలో డీ-12 కింద దరఖాస్తు చేసుకున్న ఫారాలను పరిశీలిస్తారు. ఇందులో బీఎల్వో, పదవీ విరమణ పొందిన నాయకులు, ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి సమక్షంలో ఓటు వేసి, పోలింగ్ కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. ఆర్మీ, ఇతర విధి నిర్వహణలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్న తరహాలోనే వయో వృద్ధులకు కూడా ఈ విధానంపై అవగాహన కల్పించడం వల్ల ఇక నుంచి వృద్ధుల ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ పక్రియ దోహదపడుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొంటున్నారు.
విస్తృత అవగాహన కల్పిస్తున్నాం..
ఎన్నికల కమిషన్ ఆదే శాల నేపథ్యంలో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ఎన్నికల కమిషన్ డీ-12 ఫారాన్ని అం దుబాటులోకి తెచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు ముం దు వయోవృద్ధులు, చేతకాని వారు ఓటు హక్కు ఇంటి నుంచి వినియోగించుకో వాలనుకునేం దుకు డీ-12 ఫారం ద్వారా దరఖాస్తు చేసు కోండి. కమిటీ ఇంటికి వచ్చి ఓటు వేసేలా చే స్తుంది. జిల్లాలో విస్తృత అవగాహన కల్పిస్తు న్నాం. – కిశోర్‌కుమార్, అదనపు కలెక్టర్, నిర్మల్
వయో వృద్ధులకు మంచి అవకాశం..
వయోవృద్ధ్దులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. 80 ఏండ్లు నిండిన మేము పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటింగ్ వేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎద్కుర్కొనేవాళ్లం. ఇప్పుడు వారం రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే ఫాం-12 ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ఎంసీ లింగన్న,పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు, నిర్మల్