మంచిర్యాల, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. అధికార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుండగా.. అందులో ముగ్గురు మంచిర్యాల జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించడం.. ఆ ముగ్గురూ మంత్రి పదవి రేసులో ఉండడం ‘హస్తం’లో చిచ్చురేపుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు ఎవరికి వారే మంత్రి పదవి తనకే వస్తుందంటూ చెప్పుకుంటూ వచ్చారు.
రాష్ట్రంలోని పార్టీ పెద్దలు ఎవరికి వారు తమ అనుయాయులకే మంత్రి పదవి ఇవ్వాలంటూ మూడు జాబితాలను అధిష్ఠానానికి ఇచ్చినట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ అనేక వార్తలు వచ్చాయి. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి వస్తుందని.. లేదు.. మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్‌కే మంత్రి పదవి ఖాయమైందని.. అసలు ఈ ఇద్దరికీ కాకుండా సీనియరైన బెల్లంపల్లి ఎ మ్మెల్యే వివేక్‌కు పదవి వస్తుందంటూ చర్చ నడిసింది.
ఎమ్మెల్యేల అనుచరులు సైతం మంత్రి కాబోయేది మా సారే అంటూ.. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయా లు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి పదవి విషయంలో రోజూ ఏదో ఒక చర్చ నడిచింది. ఈ క్రమంలోనే విస్తరణకు బ్రేక్ పడడంతో మంత్రి పదవి ఆశావాహులు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ మంత్రి వర్గ విస్తరణకు బ్రేక్ పడడంతో..ఎవరికి వారు మంత్రి పదవి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో వివాదాలు మరింత ముదిరిపోయాయి. అవి కాస్త ఇప్పుడు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లాయి. పదవి కోసం పట్టువిడిచేది లేదని మంచిర్యాలలో మంత్రుల సభ సాక్షిగా పీఎస్సార్ స్పష్టం చేయగా, అదే రోజు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారు తేల్చి చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యే పీఎస్సార్ మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు సమక్షంలో అసంతృప్తి వెల్లగక్కారు. 20 ఏండ్లుగా పార్టీని పట్టుకొని ఉన్నానని, కష్టకాలంలో కూడా విడిచిపెట్టకుండా అధికారంలో వచ్చేందుకు కృషి చేశానని, ఇంద్రవెల్లి, మంచిర్యాల సభను విజయవంతం చేశానని.. ఇంత చేసినా నన్ను కాదని నిన్న.. మొన్న పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ పీఎస్సార్ సభలోనే మాట్లాడారు. నాకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ స్పష్టం చేశారు.
ఒక్క కుటుంబంలో ముగ్గురికి పదవి ఇచ్చారని.. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు. అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ‘తిరుగుబాటు’ తప్పదంటూ కుండబద్దలు కొట్టారు. దీనిపై వివేక్ సైతం స్పందించారు. బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేదని.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తేనే తాను కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. పీఎస్సార్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీలు మారడం ముఖ్యం కాదని, ప్రజలకు ఎంత మంచిపని చేశామన్నదే ముఖ్యమంటూ మండిపడ్డారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పీఎస్సార్ వ్యాఖ్యలపై స్పందించారు. కాక కుటుంబంలో ముగ్గురికి పదవులు ఇచ్చారని మాట్లాడం సరికాదన్నారు. పదేళ్లు పార్టీ కోసం పని చేసిన ఆయనే అలా మాట్లాడితే 70 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ కోసమే కాక కుటుంబం పని చేస్తుందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పీఎస్సార్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని సిఫార్సు చేశామన్నారు. అవన్ని మర్చిపోయి మా కుటుంబం గురించి మాట్లాడడం సరికాదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా తాను మంత్రి పదవి ఆశించడంలో తప్పేమీ లేదన్నారు. ఇలా ముగ్గురు నేతలు ఎవరికి వారు మంత్రి పదవిపై పట్టుబట్టిన నేపథ్యంలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడుగా చీలిపోయే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రనాయకత్వం సైత ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముగ్గురు అధిష్ఠానానికి మూడు నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. ఎవరి అనుయాయుల పేర్లను వారు ప్రతిపాదించినట్లు తెలిసింది. మంత్రి పదవుల విషయంలో రాష్ట్రంలోని మంత్రులు సైతం మూడు వర్గాలుగా చీలిపోయారనే ప్రచారం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న పీఎస్సార్‌కు మంత్రి పదవి కోసం ఆయన ప్రతిపాదించి ఉండవచ్చనే చర్చ పార్టీలో నడుస్తుంది.
ఈ లోగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడంతో వివేక్, వినోద్ సైతం రేసులోకి రావడంతో ఎత్తుగడంలో భాగంగానే మంత్రుల సభ నిర్వహించారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం నాకు బరాబర్ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఓ మీటింగ్‌లో డిమాండ్ చేశారు. అదే తరహాలో మంచిర్యాలలో సభ జరగడం, మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ సైతం తనకు మంత్రి పదవి విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదంటూ చెప్పడం పథకం ప్రకారమే జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. భట్టి విక్రమార్క తన మార్క్‌ను చూపించుకోవడంలో భాగంగానే తన అనుయాయుడికి పదవి కోసం పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది.
పక్క జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు సైతం కాక కుటుంబంలో వారి కంటే పీఎస్సార్‌కు పదవి వస్తే స్థానికంగా తనకు ఎదరు ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇద్దరు మంత్రులు సపోర్ట్ చేస్తున్నారనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. మరో వైపు వివేక్ వెంటకస్వామికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. పార్టీలో చేరే సమయంలో సీఎం, సునీల్ కనుగోలు మంత్రి పదవి హామీ ఇచ్చారంటూ నిన్న ప్రెస్మీట్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే చెప్పకనే చెప్పారు. తాను సైతం సీనియర్‌గా పదవి కోరుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టారు. వినోద్ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మంత్రిగా పని చేశారు. అధిష్ఠానంలో తనకున్న పరిచాలతో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాక కుటుంబంలో ఎవరికి మంత్రి పదవి వచ్చినా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో సైతం వారు కీలకంగా మారిపోతాయి. అదే జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని కొందరు మంత్రులు భావిస్తున్నట్లు తెలిసింది. అదే పీఎస్సార్‌కు వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం అవుతారు. రాష్ట్రంలో మన బృందంలో మకొకరు చేరి బలం పెంచుకోవచ్చనే ఆలోచనల్లో ఓ మంత్రుల వర్గం ఉన్నట్లు సమాచారం.
అలా పట్టుభిగించడంలో భాగంగా వ్యూహాత్మకంగా మంచిర్యాలలో మంత్రుల సభ నిర్వహించారనే టాక్ నడుస్తున్నది. ఏదేమైనా జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవి రేసులో ఉండడం.. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళం పెంచింది. మంత్రివర్గ విస్తరణ జరిగితే పార్టీ చీలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌కు తీవ్రనష్టం జరిగే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని పార్టీ పెద్దలు ఎలా ఫేస్ చేస్తారా అన్నది వేచి చాడాల్సి ఉంది.