నిర్మల్ అర్బన్/ఎదులాపురం, సెప్టెంబర్ 6 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్రను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు బుధవార్‌పేట్ కాలనీలోని నంబర్ 1, 2, వినాయకుల వద్ద వారు ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 508 మంది పోలీసులు శోభాయాత్ర విధుల్లో పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఇద్దరు ఏఎస్పీలు, 11మంది సీఐలు, 31 మంది ఎస్ఐలు, 106 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 323 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా పోలీసులు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఆర్మూడ్, సివిల్ ఫోర్స్, భద్రతా దళాలు నిఘా పటిష్టం చేశాయి. 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రార్థన స్థలాలు, చర్చీలు, మందిరాల వద్ద పోలీసులు పహారా కాశారు. విద్యుత్, మున్సిపల్, వైద్య, అగ్ని మాపకశాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం ఆదివారం ఉదయం వరకు కొనసాగింది. గణపతి విగ్రహాలను బాజా భజంత్రీల మధ్య అశోక్ రోడ్డు, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా పెన్‌గంగా వైపు తరలించారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రేన్ల సహాయంతో డొలార వద్ద పెన్‌గంగలో నిమజ్జనం చేశారు. తహసీల్, మున్సిపల్, వైద్యారోగ్యశాఖల అధికారులు, సిబ్బంది గణపతి నిమజ్జనం విధులను నిర్వహించారు.
భారీ బందోబస్తు
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణంలో 2 పికప్ పార్టీలు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలాలకు చేరుకోవాలి. రాత్రి రెండు గంటల తర్వాత తిను బండారాల దుకాణాలు తెరిచి ఉండరాదని సూచించారు.