తాంసి, జనవరి 22 : వడ్డాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య రసాభాసగా సాగింది. అర్హులను గుర్తించి నిరు పేదలకు న్యాయం చేయాలని అధికారులపై గ్రామస్తు లు, ఉపాధి కూలీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అర్హుల జాబితా ఎవరు తయారు చేశార ని అధికారులను ప్రశ్నించారు. సంబంధిత అధికారి మాట్లాడుతూ.. మాకేం తెలవదు ఈ లిస్టు తయారు చేసి జిల్లా అధికారులకు ఇస్తాం, వారు మన ఇన్చార్జి మంత్రి సీతకకు ఇస్తే అకడే తయారు అవుతుంది. అకడి నుంచి వచ్చిన లిస్టుని గ్రామసభల్లో చదువు తున్నామని బహిరంగ సభలో ఎంపీవో లింగయ్య తెలుపడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.
ఇంకేందుకు గ్రామ సభలు పేడతారని, అదేవిధంగా అనర్హుల లబ్ధిదారుల జాబితాను తయారు చేసి నిరుపేదల పొట్టకొట్టాలని ఎద్దేవా చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా అసలైన లబ్ధిదారులకు చోటు దకలేదని గ్రామస్తులు ఇదేం పద్ధతిని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో 300 మందికి పైగా ఉపాధి హామీ వ్యవసాయ కూలీలు ఉంటే అందులో 33 మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో పేర్లు వచ్చాయని ఆరోపించారు. వచ్చిన వారిలో కూడా ఎకరానికి పైగా భూమి ఉన్న అనేక మంది పేర్లు ఉన్నాయని మండిపడ్డారు. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు పద్ధతి మార్చుకోవాలని ఇదేం పద్ధతని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభలు ఎందుకు పేడతారని అధికారులను ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ప్రజా పాలన గ్రామసభను బహిషరిస్తున్నట్లు మాజీ సర్పంచ్ బొల్లి సౌందర్య శ్రీనివాస్, నాయకులు భూమన్న, మహేందర్ అన్నారు.
మండలంలో అధికారులు చేపట్టిన ప్రజా పాలన గ్రామసభలు పోలీసుల బందోబస్తు నడుమ కొనసాగుతున్నాయి. బుధవారం వడ్డాడి గ్రామంలో చేపట్టిన ప్రజా పాలనలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేవని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తాంసి ఎస్సై రాధిక మండల పోలీసులతో రంగంలోకి దిగి వారికి సర్ది చెప్పారు. అనంతరం డీఎస్పీ జీవన్ రెడ్డి ప్రజాపాలన గ్రామసభను పరిశీలించారు. జిల్లాలో ప్రజా పాలన గ్రామసభల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వారి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పనుల్లో 2024 – 25 సంవత్సరం లో 20 రోజులు పని చేసిన వారి పేర్లను మాత్రమే లబ్ధిదారుల జాబితాలో చేర్చడం సరైన పద్ధతి కాదు. మా ఊరిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 10 శాతం మందికి రాగా అర్హులైన వారి పేర్లు జాబితాలో రాలేవు. అసలు భూమిలేని నిరుపేద కూలీలను గుర్తించి రూ.12వేలు ఆర్థిక సాయం అందించకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం.