కాసిపేట, ఫిబ్రవరి 20 : కాసిపేట మండలంలోని సోమగూడెం పాత టోల్ గేట్ శివారులో బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన చెత్తను డంప్ చేయడంపై పెద్దనపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సోమగూడెం టోల్గేట్ వద్ద చెత్త వాహనాలను అడ్డుకొని ఆందోళన చేశారు. ఎన్ని సార్లు వద్దన్నా ఎందుకు చెత్త తీసుకొస్తున్నారని, అనుమతులెవరిస్తున్నారని నిలదీశారు. 20 రోజులుగా ఇదే తంతు సాగుతుందని, ఎన్నిసార్లు అడ్డుకున్నా మారడం లేదంటూ మండిపడ్డారు.
ఆందోళనలు చేసినప్పుడు వెళ్లిపోవడం, ఆపై మళ్లీ రావడం చేస్తున్నారని చెప్పారు. భారీగా చెత్త వేయడం వల్ల అనేక రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు తిరిగి వెళ్లిపోవాలని, మళ్లీ రావద్దని, అనుమతులు తీసుకొని రావాలని, అప్పుడు ఆ అధికారి దగ్గరికి వెళ్లి తేల్చుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు. చెత్త వాహనాలను తిరిగి పంపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెండె నవీన్, గోనెల శ్రీనివాస్, పెద్దనపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, ఫి బ్రవరి 20 : మద్యం సేవిం చి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 13 మందికి జిల్లా ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం శిక్ష కింద సామాజిక సేవ చేయాలని ఆదేశించినట్లు పట్టణ ఎస్ఐ రాజశేఖర్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మందమర్రి పట్టణంలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని, కోర్టు వీరికి రెండు రోజుల పాటు పాఠశాలను శుభ్రం చేయాలని శిక్ష విధించిందని తెలిపారు.