Indore Horror : ఎంబీయే చదువుతున్న ఒక యువతి రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. చివరకు బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో శవమై కనిపించింది. అంతేకాదు.. ఈ ఘటన తర్వాత ఆ బాయ్‌ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు. ఇదంతా జరిగింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో. స్థానికంగా ఒక కాలేజీలో ఎంబీయే చదువుతున్న యువతి (24) ఈ నెల 11, మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తన స్నేహితుల బర్త్‌డే పార్టీకి వెళ్తున్నానని, రాత్రి 11.00 గంటలకు వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది.
కానీ, ఎంతసేపటికీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఇదే సమయంలో ఆమె మొబైల్ నెంబర్ నుంచి అభ్యంతరకర సెక్స్ వీడియో తన కాలేజ్ గ్రూప్‌లో పోస్ట్ అయింది. అయితే, కాలేజీ యాజమాన్యం ఆ వీడియోను వెంటనే రిమూవ్ చేశారు. ఆ వీడియో ఆ యువతిది, మరో యువకుడిదిగా అనుమానిస్తున్నారు. మరుసటి రోజైన బుధవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపల్ ఆమె తండ్రికి వీడియో విషయం చెప్పాడు. కానీ, అప్పటికే తను కనిపించడం లేదని తండ్రి ద్వారా తెలిసింది. ఇంకాస్త విచారించగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా భావించే పీయూష్ ధనోటియా అనే, అదే కాలేజీకి చెందిన యువకుడు కూడా కనిపించకుండా పోయాడు. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఒకేసారి ఇద్దరూ కనిపించకపోవడం, ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో యువతి తండ్రి, కాలేజీ యాజమాన్యం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చాలా పోలీస్ స్టేషన్లకు వెళ్లగా చివరకు పందరినాథ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో యువతి బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న పీయూష్ అద్దెకుంటున్న ఇంటికి కూడా బుధవారం రాత్రి వెళ్లి చూశారు. కానీ, ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఇంట్లోకి ఎవరైనా వస్తే చెప్పాలని యజమానికి చెప్పి వెళ్లిపోయారు. అయితే, శుక్రవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని సహా చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యువతి తండ్రితోపాటు పోలీసులు పీయూష్ అద్దెకుండే రూంకు వెళ్లి తలుపు బద్దలుకొట్టి చూడగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఆ యువతి ఇంట్లో నగ్నంగా చనిపోయి, కుళ్లిపోయిన స్తితిలో ఉంది. దాదాపు రెండు రోజుల ముందే మరణించినట్లు అర్థమైంది.
ఆమె గొంతుపై తాడులాంటి దానితో నొక్కి చంపినట్లు గుర్తులున్నాయి. దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ పీయూష్ మాత్రం కనిపించడం లేదు. అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొంతకాలంగా ఆ యువకుడు ఆమెను వేధిస్తున్నట్లు యువతి తండ్రి తెలిపాడు. ఇద్దరి మధ్య రిలేషన్ ఉండొచ్చని, వారి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా పీయూషే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.