Chinnaswamy Stadium : చిన్నస్వామి మైదానం కొత్త కళ సంతరించుకోనుంది. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో కర్నాటక క్రికెట్ సంఘం(KSCA) కీలక నిర్ణయం తీసుకుంది. భారత, కర్నాటక క్రికెట్‌కు విశేష సేవలందించిన దిగ్గజాలను గౌరవిస్తూ వారి పేర్లను చిన్నస్వామి స్టాండ్లకు పెట్టనుంది. మాజీ కెప్టెన్లు శాంత రంగస్వామి, అనిల్ కుంబ్లే (Anil Kumble), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ల పేరుతో స్టాండ్లను ఏర్పాటు చేస్తామని శనివారం కేఎస్‌సీఏ తెలిపింది.
కర్నాటక క్రికెట్ సంఘం భారత లెజెండ్స్‌కు ప్రత్యేక గౌరవం కల్పించనుంది. మ్యాచ్‌ల పునరుద్ధరుణనకు ఆమోదం లభించడంతో మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, మహిళల జట్టు మాజీ సారథి రంగస్వామిల పేర్లతో పెవిలియన్స్ ఏర్పాటు చేయనుంది. భారతదేశం గర్వించదగ్గ స్పిన్నర్ కుంబ్లే.. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. ఇక ద్రవిడ్.. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. సచిన్ 13,288తో అగ్రస్థానంలో ఉండగా.. ద్రవిడ్ 10,889 రన్స్ చేశాడు.
— ESPNcricinfo (@ESPNcricinfo) February 14, 2026
రంగస్వామి విషయానికొస్తే.. భారత మహిళల జట్టుకు మొట్టమొదటి కెప్టెన్ తను. ఆమె హయాంలోనే టీమిండియా తొంలి టెస్టు సిరీస్ గెలిచింది. అంతేకాదు.. మహిళల క్రికెట్లో తొలి టెస్టు సెంచరీ కొట్టింది ఆమెనే. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసినందున ఈ ముగ్గురి పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లు పెట్టాలని కర్నాటక క్రికెట్ సంఘం తీర్మానించింది.
ఆర్సీబీ జట్టు నిరుడు ఐపీఎల్(18వ సీజన్) విజేతగా నిలవడంతో అభిమానులు పులకించిపోయారు. విక్టరీ పరేడ్‌లో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియానికి భారీగా తరలి వచ్చారు. అయితే.. ఫ్యాన్స్ పోటెత్తడంతో అందర్నీ అదుపు చేయలేకపోయారు పోలీసులు. ఒక్కసారిగా స్టేడియం గేటు తెరవడంతో లోపలికి వెళ్లేందుకు అభిమానులు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు విడిచారు. కర్నాటక క్రికెట్ సంఘం, నిర్వహకులు నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని కమిషన్ తేల్చింది.
దాంతో.. అప్పటి నుంచి చిన్నస్వామిలో క్రికెట్ ఊసే లేకుండా పోయింది. క్రీడలను ప్రేమించే బెంగళూరులో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం, కొత్తగా ఎన్నికైన కేఎస్‌సీఏ కార్యవర్గం చేసిన ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయి. ఏక సభ్య కమిషన్ నుంచి ఆమోదం లభించగా.. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ఈమధ్యే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సో.. పంతొమ్మిదో సీజన్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆదిథ్యమిచ్చే అవకాశాల్ని కొట్టిపారయలేం.