హైదరాబాద్‌లోని జలవనరుల రక్షణ, అక్రమార్కుల కబ్జాలోని ప్రభుత్వ స్థలాల సంరక్షణ పేరుతో ప్రభుత్వం నిరుడు జూలైలో జీవో 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్-హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కాలంలో పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు హైడ్రా చెప్పుకొంటున్నది. కానీ హైడ్రా అసలైన కథ వేరే ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడం వంటి ఉల్లంఘనలు కోకొల్లలు. హైడ్రా చేస్తున్న పనులపై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్ట్ వరుసగా మొట్టికాయలు వేస్తూనే ఉన్నది. . తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారం ముందు నుంచీ వివాదాస్పదంగానే ఉన్నది. బుల్డోజర్లను ఉపయోగిస్తూ ప్రభుత్వం సాగిస్తున్న కూల్చివేతల విషయంలో ఆయన తీరు పట్ల ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. న్యాయస్థానాల ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా ఒంటెద్దు పోకడపట్ల విపక్షాలు, ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగనాథ్‌పై దాఖలైన 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఆఫీస్ కోర్ట్ ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని, ఆయనను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు ముందు కూడా రంగనాథ్ తీరు పట్ల హైకోర్ట్ పలుమార్లు మొట్టికాయలు వేసింది. ఇటీవలే ఆయన అరెస్ట్‌కు సైతం ఆదేశాలు ఇచ్చి, న్యాయవాదుల విజ్ఞప్తితో విరమించుకున్నది. హైడ్రా అరాచకాలు, రంగనాథ్ ఉల్లంఘనలపై హైకోర్ట్ చాలాసార్లు ఘాటుగానే స్పందించింది.
కూకట్‌పల్లిలోని 13.17 ఎకరాల విస్తీర్ణంలో కూల్చి వేసిన నిర్మాణాలను హైడ్రానే పునరుద్ధరించాలని జూన్‌లో హైకోర్ట్ తేల్చిచెప్పింది. హైడ్రా దుస్సాహసాన్ని న్యాయస్థానం తీవ్రంగా ఖండిస్తున్నదని జస్టిస్ నాగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయని చెప్పినప్పటికీ రాత్రంతా కూల్చివేతలు జరుపడమేంటని నిలదీసింది. నిర్మాణాల పునరుద్ధరణకు అయ్యే ఖర్చును అధికారుల వ్యక్తిగత నిధుల నుంచి భరించాలని తేల్చిచెప్పింది. ఇది అరుదైన తీర్పు అని చెప్పవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వృద్ధుడికి చెందిన వ్యవసాయ భూమిలో చేసిన విధ్వంసాన్ని కూడా జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.
హైడ్రా చర్యలు యుద్ధ పరిస్థితిని తలపించే చర్యలు అని అభివర్ణించింది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ చట్టాల ప్రకారం నమోదు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవడాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. హైడ్రా చర్యలు సరైన దిశలో లేవని న్యాయమూర్తి స్పష్టంచేశారు. 2025 ఫిబ్రవరిలోనూ జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముత్తంగి గ్రామంలో ఓ షెడ్‌ను హైడ్రా కూల్చివేసిన తీరును దొంగల ముఠా చర్యగా పోల్చింది.
రాత్రిపూట రహస్యంగా కూల్చివేతలు జరుగుతున్నాయని, చట్టపరమైన ప్రక్రియను పాటించకపోతే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ముందస్తు సమాచారం లేకుండా సెలవు రోజుల్లో ఎందుకు కూల్చివేతలకు పాల్పడుతున్నారని నిలదీసింది. హైడ్రా తీరుపై హైకోర్ట్ పదేపదే మొట్టికాయలు వేస్తున్నా, అధికారుల తీరును తప్పుబడుతున్నా ఆ సంస్థ యథేచ్ఛగానే వ్యవహరిస్తున్నది. ఇందుకు నిదర్శనం లోతుకుంటలో హైడ్రా చేపట్టిన కూల్చివేతల పర్వం. ఏవీ రంగనాథ్‌పై శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన మూడో ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా జూలై 21న కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
రంగనాథ్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడంతో ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకున్నది. రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని తేల్చిచెప్పింది. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైకోర్టులో విచారణకు రంగనాథ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కూడా హైడ్రా వ్యవహరించే తీరులో మార్పు రాలేదు. దీంతో ఈ నెల 23న వివాదాస్పద స్థలంలో మోహరించేందుకు సైనిక సిబ్బంది జాబితాను అందించాలని కోరుతూ బైసన్ డివిజన్లోని అత్యంత సీనియర్ బ్రిగేడియర్‌ను సంప్రదించాలని కోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, ఎవరైనా ఆ స్థలంలోకి ప్రవేశిస్తే వారిని సైనిక సిబ్బంది అదుపులోకి తీసుకోవచ్చని, వారిలో హైడ్రా సిబ్బంది కూడా ఉంటారని హెచ్చరించింది.
హైడ్రా చీఫ్ తానే ఒక చట్టంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే, అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు సైనిక సిబ్బంది మోహరింపు ఉత్తర్వులను కూడా హైకోర్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది. జలవనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటూ హైడ్రా చెప్పుకొస్తున్నది. కానీ వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. హైడ్రా అంటే ఉదయం 4 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేసే సంస్థ అని పేరుమోసింది. కోర్ట్ ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా ధిక్కారణ ధోరణితో ప్రవర్తిస్తూ, ఆ ప్రవర్తననే విజయంగా ప్రచారం చేసుకొనే బృందంగా గుర్తింపు పొందింది.
హైకోర్ట్‌లో 700కు పైగా కేసులు ఎదుర్కొంటున్న హైడ్రా, వివిధ కేసుల్లో విచారణల సందర్భంగా ధర్మాసనాలతో మొట్టికాయలు వేయించుకుంది. హైడ్రాను ఉద్దేశించి అలవాటుపడ్డ నేరగాడిలా, తనకు తానే చట్టంలా, బందిపోటు దొంగల ముఠాను తలపించే సంస్థగా న్యాయమూర్తులు అభివర్ణించారు. అంతేకాదు, హైడ్రా రాజకీయంగా తటస్థంగా వ్యవహరించడంలేదని ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది.
అధికార పార్టీకి చెందిన నేతల అక్రమ కట్టడాలను హైడ్రా ఎందుకు కూల్చివేయడంలేదని విపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధమైన నిబంధనలు పాటించడంలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం, గడువు అడిగితే నిరాకరించడం, అప్పీల్‌కు అవకాశం కల్పించకపోవడం తీవ్ర అభ్యంతరకరం. కేవలం ప్రభుత్వ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టడం దారుణం. ప్రజల ఆస్తులను కాపాడుతున్నామంటూ పైకి చెప్తూ, ప్రజల హక్కులను కాలరాయడం దుర్మార్గం.
మరోవైపు హైకోర్ట్ ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారలేదు. మందలించడం, మొట్టికాయలు వేయడం, అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడం, మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించినప్పుడైనా హైడ్రా మారిందా అంటే, ఏ మాత్రం లెక్కలేనితనంతోనే వ్యవహరించింది. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ‘అంతా మా ఇష్టం.. పాలకులు చెప్పినట్టు తలూపుతాం’ అన్నట్టుగా వ్యవహరించే అధికారులకు హైకోర్ట్ తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పాలి.
– సుక్కన్న