మహిళలు మాతృత్వానికి ఆశ పడుతుంటారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటారు. గర్భిణీ దశ నుంచి బాలింతల వరకు అప్రమత్తంగా ఉంటూ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతారు. మధ్య తరగతి వారితోపాటు ఆర్థికంగా ఉన్న వారు కూడా సొంత లేదా అద్దె వాహనాలను ఆశ్రయిస్తారు. కాగా.. సామాన్య, నిరుపేద కుటుంబాల గర్భిణులు దూర ప్రాంతంలో ఉన్న దవాఖానలకు వెళ్లడానికి అవస్థలు పడుతుంటారు. చాలా మంది గర్భిణులు హాస్పిటల్స్‌కు వెళ్లలేక ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకం. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర సర్కారు ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’ పంచాలనే ఉద్దేశంతో అమ్మఒడి పేరిట 102 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. ఒక్క కాల్ చేస్తే గర్భిణులు, బాలింతలను దవాఖానలకు తీసుకెళ్లి వైద్య సేవల అనంతరం ఇంటి వద్ద దింపుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 43 వాహనాలు ఉండగా.. 1,94,499 ట్రిప్పులతో 4,89,517 గర్భిణులకు సేవలు అందించాయి. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సేవలు అందించడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.
– మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 1
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 1 : గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర సర్కారు 108 తరహాలో అమ్మ ఒడి పేరిట 102 వాహనాలను 2018 సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల 10, ఆదిలాబాద్ 13, నిర్మల్ 5, కుమ్రం భీం ఆసిఫాబాద్ 15 మొత్తం 43 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, జైపూర్, మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. నస్పూర్, చెన్నూర్ కమ్యునిటీ హెల్త్ సెంటర్లు.. బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖాన, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మా తా శిశు ఆరోగ్య కేంద్రాలకు 102 వాహనాలు గర్భిణులు, తల్లీబిడ్డలను తీసుకెళ్తున్నాయి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాహనం ఇంటికొస్తుంది.
గర్భిణులకు మూడు నెలలు వచ్చినప్పటి నుంచి ప్రసవానంతరం పుట్టిన చిన్నారికి మూడు నెలలు వ చ్చేంత వరకు దవాఖానకు తీసుకెళ్లి, వైద్య సేవలు అందిన అ నంతరం మళ్లీ ఇంటి వద్ద దింపుతున్నారు. అనంతరం కూడా 102 సేవలను వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ దవాఖానలకు మాత్రమే తీసుకెళ్తాయి. ప్రయాణంలో అత్యవసరంగా వైద్యం అందిచాల్సి వస్తే ఎమర్జెన్సీ కిట్‌ను అందుబాటులో ఉంచారు. వైద్య పరీక్షల అవసరం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆడియో రూపంలో వినిపిస్తారు.
దూరప్రాంతాలు, పేదలకు ప్రయోజనం..
రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న దూరప్రాంతాలతో పాటు నిరుపేద కుటుంబాల వారికి 102 వాహన సేవలు ప్రయోజనకరంగా మారాయి. ప్రయాణంతోపాటు ఉచితంగా వైద్య సేవలు అందుతుండడంతో గర్భిణులు, బాలంతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యేటా వర్షాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రయాణానికి అవస్థలు పడేవారు. 102 సేవలు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బందులు తొలిగాయి. 102 సేవలు అందించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 43 అంబులెన్స్‌లు ఈ మూడు నెలల కాలంలో 27,205 మంది గర్భిణులకు సేవలు అందించాయి.