కెరమెరి, జూలై 30: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలని ఉపాధ్యాయులను ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ ఆదేశించారు. మంగళవారం హట్టి, అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలతో పాటు కెరమెరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలని తెలిపారు.
పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్ రూం, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మురుగు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం వచ్చేలా చూడాలన్నారు. అనంతరం అనార్పల్లి పీజీ హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆమె వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.