బేల : రసాయన ఎరువులు ( Fertilizers ) , పురుగు మందుల ( Pesticides ) వాడకం తగ్గించాలని, శాస్త్రవేత్త డాక్టర్ శివ చరణ్ ( Scientist Shiva Charan ) అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తల సూచనల ప్రకారం యాజమాన్య పద్ధతులలో వ్యవసాయం చేసి తక్కువ ఖర్చులతో లాభాలు పొందాలని సూచించారు. రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా గురువారం చెప్రాల గ్రామంలో శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి రైతు వేదికలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శాస్త్రవేత్త శివచరణ్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు విచ్చల విడిగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి భూసారాన్ని తగ్గిస్తుండడం వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలని కోరారు. విచ్చల విడిగా క్రిమి సంహారక మందులు వాడడం తో కూడా రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు నేల పైనా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
భూ పరీక్షలు చేయించి వాటి ప్రకారం ఎరువులు, మందులు వాడితే పెట్టుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని, రసీదు సంబంధిత రైతు పేరుతోనే ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు డాక్టర్ రాజశేఖర్, శివచరణ్, బేల మండల వ్యవసాయ అధికారి సాయి తేజ, సీపీఎఫ్ ( CPF ) స్వచ్ఛంద సంస్థ అధికారి సత్యం, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు, చెప్రాల క్లస్టర్ రైతులు పాల్గొన్నారు.