సోన్/దస్తురాబాద్, సెప్టెంబర్ 5 : ‘వరి నాట్లు వేసి నెల రోజులైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా చల్లింది లేదు. ఇప్పుడు కూడా యూరియా ఎప్పుడు దొరుకుతదో తెలుస్తలేదు. ఇట్లయితే వరి పైరు ఎట్ల ఎదుగుతది’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ మండలం కౌట్ల (బీ) గ్రామంలో మంజులాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో 450 యూరియా బస్తాలు శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ విషయం తెలుసుకొని రైతులతో పాటు మహిళా రైతులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో వచ్చి బారులు తీరారు. ఆధార్‌కార్డు జిరాక్స్‌ను తీసుకొని ఒక్కొక్కరికీ నాలుగు బ్యాగుల చొప్పున టోకెన్లు అందించారు. గంటలోపే యూరియా పంపిణీ పూర్తయింది. కొందరికి రెండు బ్యాగులే దొరకగా, మరికొందరికీ మొత్తానికే అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
దస్తురాబాద్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో 450 బస్తాలు యూరియా రావడంతో పలు గ్రామాల నుంచి రైతులు వచ్చి పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి నిలబడినప్పటికీ కొందరు రైతులకు అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. యూరియా వేయకపోవడంతో వరి పైరుపై ప్రభావం పడిందని , ఆలస్యంగా వేస్తే లాభం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.