కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కౌటాల/నెన్నెల/తలమడుగు, జూలై 1 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్‌ల ముందు రైతులు యూరియా కోసం బారులు తీరడం కనిపించింది. వర్షంలో తడుస్తూ గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టీ రైతు సహకార కేంద్రం ముందు రైతులు మూడు రోజులుగా ఉదయం ఏడింటి నుంచే క్యూ కడుతున్నారు. రద్దీ పెరగడంతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి నిరీక్షిస్తే ఒక్కొక్కరికీ రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కౌటాల, చింతలమానేపల్లి మండల కేంద్రాల్లోని రైతు వేదికల వద్ద రైతులు యూరియా టోకెన్ల కోసం బారులు తీరారు. పట్టా భూములున్న రైతులకు ఎకరానికి రెండు బ్యాగుల చొప్పున ఇచ్చారు.
ఇక పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ప్రైవేట్ దుకాణాల్లో తప్పని పరిస్థితిలో రూ. 500 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని రైతు ఉత్పత్తి దారుల సంఘం కేంద్రానికి మంగళవారం 12 టన్నుల యూరియా రాగా, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టాదార్ పాస్‌బుక్కులు, ఆధార్ కార్డులు పట్టుకొని క్యూ కట్టారు. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టివేసుకున్నారు. మాటా మాటా పెరిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. నెన్నెల ఎస్ఐ ప్రసాద్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. పోలీసుల పహారా మధ్య రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సీ(బీ) గ్రామంలోని పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మండల వ్యవసాయ శాఖాధికారి ప్రమోద్ రెడ్డి గోదామును సందర్శించారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదున్నారు. తలమడుగు, సుంకిడి, ఝరి, భరంపూర్, పల్లి(బీ) సబ్సెంటర్లలో ఎరువులు అందిస్తున్నామని, ఒక్కో రైతుకు ఐదు బస్తాల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.