మంచిర్యాల, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లుకావస్తున్నా ఆ విషయమై నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి.. ఆపై ఆ హామీని పూర్తిగా విస్మరించగా, యువతలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. కేసీఆర్ సర్కారులో ప్రకటించిన ఉద్యోగాలే తప్ప.. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేమీ లేదంటూ నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. నోటిఫికేషన్ ఇచ్చి.. పరీక్షలు పెట్టి.. ఫలితాలు వెల్లడించింది బీఆర్ఎస్ కాగా, కేవలం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి.. ఆ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్న హస్తం పార్టీ.. తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్నది. ఇక జాబ్ క్యాలెండర్ అంటూ ఆశపెట్టి.. ఆ ఊసెత్తని కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగ యువత సిద్ధమవుతున్నది.
ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఏవీ నిలబెట్టుకోవడం లేదు. ‘యేటా జూన్ 2వ తేదీ నాటికి అన్ని శాఖల ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తి చేస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో రేవంత్ ప్రకటించిన విషయం విదితమే. కానీ, అధికారంలోకి వచ్చి.. రెండో సెప్టెంబర్ 17 సైతం వస్తున్నది. పోయినేడాది ఎలాగూ చేసిందేమీ లేదు. కనీసం ఈ ఏడాదైనా ఉద్యోగాల ప్రకటన ఉంటుందనుకుంటే అదీ లేదు. ఇప్పటి దాకా ఏ శాఖ నుంచి కూడా ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్న స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. జూన్ 2వ తేదీ పోయి (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) రెండు నెలలు పూర్తయ్యింది. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సెప్టెంబర్ 17 తేదీకి ఎంతో దూరం లేదు.
మరి జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు ఏమైనట్లు అని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు. 2024 ఏడాది ముగింపునాటికి.. రాష్ట్రవ్యాప్తంగా 9వేల మంది ఉద్యోగ విరమణ పొందగా, 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి మరో 9 వేల మంది రిటైర్డ్ అయినట్లు అంచనా. ఈ లెక్కన ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉండొచ్చని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇవన్నీ వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులైనప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టడంలో సర్కారు ఘోరంగా విఫలం అవుతుందంటున్నారు.
పైగా ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిస్ట్ సైతం 2028 తర్వాత ఇస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తున్నది. దీనిపై ఉద్యోగుల్లోనూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎలాగూ తాము ఇవ్వలేమని.. మరోసారి గెలవలేమని తెలిసే.. వచ్చే సర్కార్‌పై భారం మోపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కావాలనే ఉద్దేశపూర్వంగా వాయిదా వేస్తుందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నది.
ఉద్యోగాల భర్తీతో పాటు, నిరుద్యోగులకు రూ.4వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. ఏ ఆధారంతో, అర్హులను ఎలా గుర్తిస్తారు.. పథకాన్ని ఎలా అమలు చేస్తారన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. దీంతో ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ భృతి సైతం మరుగున పడిపోయింది. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై, యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్స్‌కు నెలకు రూ.10వేల ఫెలోషిప్ హామీలు ప్రయోగ దశలోనే ఉన్నాయి. విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం రూ.50 వేలకు పెంచుతామని చెప్పిన మాటలు అమల్లోకి రాలేదు.
తొలిసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేరు నమోదు చేస్తే, ఆ ఏడాదిలో మిగతా నోటిఫికేషన్లకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్న హామీ కూడా ఇంకా అమల్లోకి రాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాల ప్రక్రియ అంత వేగంగా సాగడం లే దు. ఇవేవీ చేయకపోగా ప్రభు త్వం ఉల్టా నిరుద్యోగులనే బద్నాం చేస్తున్నది. ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయొద్దంటూ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటూ పదే పదే చెప్పుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను గాలికి వదిలేసి నిరుద్యోగులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.
ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం, క్యాడర్ స్ట్రెంత్ విభజనపై స్పష్టత లేకపోవ డం, విభాగాల పునర్వ్యస్థీకరణ జరగకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చె ందిన బ్యాక్లాగ్ పోస్టులపై సైతం స్పష్టత ఇవ్వలేదు. ఇలా నిరుద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఆయా వర్గాల్లో అసంతృప్తికి దారి తీస్తున్నది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపనున్నదన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం 59వేల ఉద్యో గాలు ఇచ్చామని చెప్పుకో వడం మానుకోవాలి. కేసీఆర్ సర్కార్ విడుదల చేసిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి గొప్పలు చెప్పుకోవడం సరికాదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ ఎక్కడికి పోయాయి. నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి విధానాన్ని రూపొందించి తక్షణమే అమలు చేయాలి.
– బడికల శ్రావణ్ కుమార్, బీఆర్ఎస్వీ (మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు )
నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న నిరుద్యోగులే.. వద్దని రాస్తారోకోలు చేస్తున్నా రని ముఖ్యమంత్రి, మంత్రు లు నిందలు వేయడం సరి కాదు. రాను రానూ ఉద్యోగ ఖాళీలు పెరుగుతున్నాయి. మరోవైపు నియామకాలు చేపట్టకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వ్యవస్థ నాశనానికి దారి తీసినట్లు అవుతుంది. ప్రతి శాఖ నుంచి ఖాళీల వివరాలను సేకరించి, ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలండర్ ప్రకటించాలి. నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగాలు భర్తీ చేయాలి.
– మారిశెట్టి విద్యాసాగర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి