ఆదిలాబాద్, మే 7(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు భారీగా పంటలు నష్టపోయారు. మార్కెట్ యార్డులకు తెచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోకి వరద నీరు చేరడంతో పంట ఉత్పత్తులు తడిశాయి. సొంత డబ్బులతో ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేసి పంటలపై కప్పిన ఫలితం లేకుండా పోయింది. పంటను కాంటా చేసి సంచుల్లో నింపిన కొనుగోళ్ల పట్టీలు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. బేల సబ్ మారెట్ యార్డులో జొన్న పంట తడిసింది. నేరడిగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు కొనుగోలు చేస్తున్న సమయంలో వర్షం జోరుగా కురిసింది. కుప్పలపై టార్పాలిన్స్ కప్పడానికి వర్షంలోనే తడుస్తూ రైతులు పంట ఉత్పత్తులు కాపాడుకున్నారు.

జైనథ్ మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న జొన్నలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. గన్నీ బ్యాగులు లేని కారణంగా వారం రోజుల నుంచి జొన్నలు కొనలేదు. పంట కండ్ల ముందు తడిసి ముద్దవుతుంటే రైతులు కంటతడి పెడుతున్నారు. ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులోని మొక్కజొన్నను తాడిపత్రులతో కప్పి రక్షణ తీసుకున్నారు. కోతకొచ్చిన జొన్న పంటలతోపాటు గోధుమ పంటలు వర్షంతో కొంత మేర తడిసి నష్టం వాటిల్లింది.

బోథ్ మండలంలో కోత దశలో ఉన్న జొన్న, నువ్వు పంటలు నేలకొరిగాయి. ధన్నూర్(బీ) ప్రాంతంలో కురిసిన వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జొన్నలు అమ్మకానికి తెచ్చి బస్టాండ్ సమీపంలో కుప్పలుగా పోసి నిల్వ ఉంచారు. గాలి దుమారానికి టార్పాలిన్ లేచిపోవడంతో కప్పడానికి అవస్థలు పడ్డారు. మరోవైపు గాలి మూలంగా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి.

దిలావర్పూర్ మండలంలో వరి, నువ్వులు, ఇతర పంటలు నేలకొరిగాయి. కేంద్రాల్లోని మక్కలు, ధాన్యం తడిసింది. చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు, ధాన్యాన్ని రక్షించుకోవడానికి పారీలతో పడరానిపాట్లు పడ్డారు. ముథోల్ మండలంలో వరి, మొక్కజొన్న సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు అవస్థలు పడ్డారు. కుంటాల కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడ్డారు. ఖానాపూర్లో కల్లాల్లో అరబోసిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డారు. భైంసా మినీ స్టేడియంలోని కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయించడానికి ఆరబెట్టిన కుప్పలు తడిశాయి. రైతులు టార్ఫలిన్లు కప్పి వాటిని తడిసిపోకుండా చూసుకున్నారు.

నేను నాలుగెకరాల్లో జొన్న సాగు చేశా. 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అధికారులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న కొనుగోళ్లను ప్రారంభించడంతో పంటను అమ్మడానికి సోమవారం మార్కెట్ యార్డుకు వచ్చా. నాలుగు రోజులు అవుతున్నా మా దగ్గరికొచ్చి అడిగిన వారు లేరు. రాత్రి, పగలు మార్కెట్ యార్డులో పంట అమ్మకానికి పడిగాపులు కాస్తున్నాం. జొన్నలు ఎప్పుడు కొంటారని అడిగితే ఏమి చెప్పడం లేదు. వర్షంతో పంట తడిసింది. ప్రభుత్వం పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు.
– వెంకటి, రైతు, యాపల్గూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం

నేను ఈ సీజన్లో ఐదెకరాల్లో జొన్న సాగు చేశా. 80 క్వింటాళ్లను రెండు రోజుల కిందట ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో ఇతర గ్రామాలకు చెందిన రైతులు పంటను తెచ్చారు. కొనుగోలు చేయాల్సిన అధికారులు కనీసం ఇటువైపు చూడడం లేదు. మేము ఆఫీసుకు వెళ్లి అడిగితే అలాట్మెంట్ రాలేదు అంటున్నారు. వర్షం వస్తుండడంతో ప్లాస్టిక్ కవర్లు కావాలని మార్కెటింగ్ అధికారులను అడిగితే లేవని చెప్పారు. దీంతో సొంత పైసలతో కవర్లు కొన్నాం. వర్షంతో నా పంట తడిసింది. ఇప్పటికైనా జొన్న కొనుగోళ్లు ప్రారంభించి నష్టపోకుండా చూడాలి.
– అడెల్లు, రైతు, అర్లీ, ఆదిలాబాద్ రూరల్ మండలం