ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు నార్మల్ డెలివరీలకు కేరాఫ్‌గా నిలుస్తుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు సకల సౌకర్యాలు కల్పించి సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తుంటే.. ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడి కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అవసరం లేకున్నా ఏదో ఒక సాకు చెప్పి అందినకాడికి దండుకుంటున్నాయి. ఇక ‘మంచిరోజు’ పేరిట వారాలు నిండకముందే పురుడు పోసేందుకు పరోక్షంగా ప్రజలే సహకరిస్తుండగా, ఇటు తల్లితో పాటు అటు పిల్లలకూ ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న దవాఖానల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి, వాటిపై చర్యలకు సిఫార్సు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
– మంచిర్యాల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎదులాపురం, సెప్టెంబర్ 8 : నా పేరు మెస్రం సరస్వతి. మా ఊరు ఊట్నూర్ మండలం పెర్కగూడ. ఈ నెల రెండు తారీఖున నాకు పురిటి నొప్పులు వచ్చినయ్. నా భర్త నరేశ్‌కుమార్ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసిండు. వెంటేనే వచ్చి ఆదిలాబాద్ రిమ్స్‌లో చేర్చిన్రు. అదే రోజు రాత్రి నార్మల్ డెలివరీ చేసిన్రు. బిడ్డ.. నేను మంచిగనే ఉన్నం. డాక్టర్లు, నర్సులు దగ్గరుండి చూసుకుంటున్నరు. అదే ప్రైవేట్ దవాఖానకు కాన్పు కోసం పోతే మస్తు పైసలయ్యేవి. ఇక్కడ రూపాయి తీసుకోకుండా డెలివరీ చేసిన్రు. రూ. 12 వేలు కూడా వస్తయని చెప్పిన్రు. కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. దీంట్ల అన్ని రకాల వస్తువులున్నయి. నాకు.. నా బిడ్డకు అక్కరకు వస్తయి. పుట్టింటోళ్లు పెట్టినట్లు సామన్లన్నీ పెట్టిన్రు. మొదటి కాన్పు (కుమారుడు) కూడా సర్కారు దవాఖాన్లనే అయ్యింది. మాలాంటి పేదింటి ఆడ బిడ్డలు డెలివరీ కోసం తిప్పలపడవద్దని సీఎం కేసీఆర్ సార్ గవర్నమెంట్ దవాఖాన్ల అన్ని సౌలతులు కల్పించిన్రు. ఆయన సల్లగుండాలె.
మంచిర్యాల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు నార్మల్ డెలివరీలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. డెలివరీ చేసి, కేసీఆర్ కిట్టు ఇచ్చి, ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటి దగ్గర దిగబెడుతున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్టు సైతం ఇస్తున్నారు. దీంతో చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రసవానికి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీపంలోని సబ్ సెంటర్లలోనే పురుడు పోస్తుండడంతో వ్యయప్రయాసలు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య సైతం పెరుగుతూ వస్తున్నది. మరోవైపు ప్రైవేటు హాస్పిటల్స్ నార్మల్ డెలివరీ చేసే ఛాన్స్ ఉన్నా, ఆపరేషన్లే చేసేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 11,709 డెలివరీలు కాగా, ఇందులో 56 శాతం నార్మల్ డెలివరీలు ఉన్నాయి. అదే ప్రైవేటు హాస్పిటల్స్‌లో 11,829 డెలివరీలు కాగా, ఇందులో 13 శాతం మాత్రమే నార్మల్ డెలివరీలు ఉండడం గమనార్హం. గడిచిన మూడేళ్లలో చూస్తే ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ శాతం నార్మల్ డెలివరీలు చేస్తుంటే.. ప్రైవేటులో మాత్రం సీ-సెక్షన్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సాధారణ ప్రసవం చేస్తే తల్లి వారం, పది రోజుల్లో కోలుకుంటుంది. బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు గర్భంలో ఉంటే అంత ఆరోగ్యంగా పుడుతుంది. కానీ ప్రైవేటు దవాఖానలు కాసుల కోసం కక్కుర్తి పడి అమ్మ గర్భంలో సురక్షితంగా ఎదగాల్సిన బిడ్డలను కొన్ని వారాల ముందుగానే ఆపరేషన్ చేసి బయటికి తీస్తున్నాయి. దీంతో నానా అవస్థలు పడాల్సిన దుస్థితి. అప్పుడే పుట్టిన పిల్లలు జాండిస్, ఎదుగుదల లేని శరీర అవయవాలు, తక్కువ బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ అవే దవాఖానల్లో చేరడం వల్ల ప్రైవేటుకు ఆదాయ మార్గంగా మారుతున్నారు. మరోవైపు బిడ్డ ఎదిగే చివరి దశలోనే సిజేరియన్ చేయడంతో తల్లులూ తల్లడిల్లిపోతున్నారు. ఆరోగ్యం దెబ్బతిని నెలల కొద్ది మంచాన పడుతున్నారు. ఎక్కువ సేపు కూర్చోలేక, నిలబడలేక.. బిడ్డ ఏడిస్తే ఎత్తుకోలేక, దగ్గరకు తీసుకొని పాలివ్వలేక నరక యాతన పడుతున్నారు. అనర్థాలకు దారి తీస్తున్న సిజేరియన్ డెలివరీలను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ వస్తున్నది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో నిత్యం సమీక్షిస్తూ సాధారణ ప్రసవాలు పెంచాలని చెబుతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో మాతా శిశు ఆసుపత్రుల ఏర్పాటు, జనరల్ ఆసుపత్రుల్లో పడకల పెంపునకు చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి గర్భిణుల నమోదు, మానిటరింగ్ చేయడం, అవసరమైన మందులు సరఫరా చేయడంతో కొంత మేర సత్ఫలితాలు వస్తున్నాయి.
ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసరమైతైనే తప్ప సిజేరియన్లు చేయడం లేదు. కానీ ప్రైవేటులో డెలివరీ తేదీకి రెండు నుంచి మూడు వారాల ముందుగానే సీ-సెక్షన్ (సిజేరియన్లు/ఆపరేషన్లు) చేస్తున్నారు. ఏవేవో కారణాలు చెప్పి లేని సీరియస్‌నెస్ క్రియేట్ చేసి ఆపరేషన్లు చేసుకోవాలని భయపెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేసినా ప్రైవేటులో మాత్రం ఆపరేషన్లు ఆగడం లేదు. దీంతో అలాంటి ప్రైవేటు హాస్పిటల్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్యారోగ్య శాఖ సమాయత్తం అవుతున్నది. ఇప్పటి వరకు చేసిన డెలివరీలపై నివేదికలు తెప్పించి అవసరం లేని కేసుల్లో ఎందుకు ఆపరేషన్లు చేశారనే విషయాన్ని సైతం ఆరా తీయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతేడాది సైతం ఈ తరహా ప్రక్రియను వైద్యారోగ్య శాఖ చేసింది. ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సారి మాత్రం సరైన సమాధానం చెప్పని ప్రైవేటు ఆసుపత్రుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి, వాటిపై చర్యలకు జిల్లా అధికారులు సిఫార్సు చేయనున్నారు.
సిజేరియన్లకు పరోక్షంగా ఆడపిల్ల తల్లిదండ్రులు, భర్తలు కారణం అవుతున్నారు. లక్షల రూపాయాలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. ఈ ఒక్క కాన్ఫు ఎల్లదీస్తే అయిపోతది. ప్రభుత్వ దవాఖానాకు పోవడం ఎందుకు ఓ లక్ష రూపాయాలు పోయినా ప్రైవేటులోనే చేపిస్తాం అనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. దీనికి గర్భిణుల భర్తల సపోర్ట్ కూడా ఉంటుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకూ.. ఎలాగూ ప్రైవేటుకు వెళ్తున్నాం కదా.. ఆపరేషన్ చేయిద్దామనే చాలా మంది అనుకుంటున్నారు. దీనికి తోడు మంచి రోజులనే పిచ్చి ఆలోచనలతో సిజేరియన్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు. డెలివరీ తేదీ బాగా లేదు… మంచి రోజు చూసుకొని చేపిద్దామని డాక్టర్ల దగ్గరకు పైరవీలకు వెళ్లే వారు ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు ఉంటున్నారు. నాకు పుట్టబోయే బర్త్‌డే.. నా బర్త్‌డే ఒకే రోజు ఉండాలని వారాలు నిండకముందే ఆపరేషన్లు చేయిస్తున్న వారు సైతం చాలా మంది ఉంటున్నారు. ఈ కారణాలన్నీ కూడా నార్మల్ డెలివరీలను సిజేరియన్లుగా మారుస్తున్నాయి.