కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయింపులు లేవు. ఉమ్మడి జిల్లాలో ఒక బీజేపీ ఎంపీ స్థానంతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. దీంతో ఈ సారైనా కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఆశించిన జిల్లావాసులకు నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌తోపాటు జిల్లా ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను కలిసి వినతులు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ సారైనా బడ్జెట్లో తమ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలు ఆశించినా నిరాశే మిగిలింది.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ)
మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించడానికి అన్ని అవకాశాలున్నా.. కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ప్రస్తుతం సిమెంటు రంగానికి మంచి డిమాండ్ ఉండగా.. పరిశ్రమ ప్రారంభానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి-44కు సమీపంలో పరిశ్రమ భూములు, సిమెంటును తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు, మహారాష్ట్రతోపాటు ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు రోడ్డు మార్గం ఉంది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌తోపాటు నీటి వనరులు ఉన్నాయి. సిమెంటు తయారీకి అపారమైన వనరులు ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడనాడడం లేదు. సిమెంటు పరిశ్రమను ప్రారంభించాలని అఖిలపక్షం నాయకులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. గతంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, హన్స్‌రాజ్ గంగారాంలు సీసీఐని ప్రారంభిస్తామని హామీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్లాలంటే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వస్తున్నది. ఇందుకు 9 నుంచి 10 గంటల సమయం పడతుంది. జిల్లావాసులు రైలులో నగరానికి వెళ్లేందుకు కేంద్రం 2009-10 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు లేన్ మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం రూ.3,771 కోట్లు అవుతుండడంతో తక్కువ ఖర్చతో ఆర్మూర్ లేన్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు లేన్ వేస్తే అక్కడి నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు రైలులో వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో 2017 బడ్జెట్లో ఆదిలాబాద్-ఆర్మూర్ లేన్‌ను మంజూరు లభించింది. లేన్ సర్వే నిర్వహించిన అధికారులు రూ.2,990 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు వేశారు. ఈ రైల్వే లేన్‌కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని జిల్లావాసులు ప్రతి బడ్జెట్లో ఎదురు చూస్తున్నా నిరాశే మిగులుతున్నది. ఈ బడ్జెట్లోనైనా రైల్వేలేన్ ఊసెత్తలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగుల వేతనాలను పెంచింది. దీంతో వారీ జీతాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా ఒక్కో కార్మికుడు రూ.ఒక లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయ పన్ను చెల్లిస్తున్నాడు. ఏడాదిలో రెండు నెలల వేతనం పన్ను చెల్లించడానికి సరిపోతుంది. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయించాలనే డిమాండ్ ఎప్పడి నుంచో ఉంది. కేంద్ర బడ్జెట్లో స్లాబ్ రూ.12 లక్షల పెంచడం కాస్త ఊరట కలిగించినా, వారి డిమాండ్ మాత్రం పరిష్కారం కాలేదు.
హైదరాబాద్-ఆదిలాబాద్ జాతీయ రహదారి-44 జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నేషనల్ హైవేకు ఇరు వైపులా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. జిల్లాలో ముడిసరుకు లభ్యమయ్యే వస్త్ర, వివిధ రకాల పంటల ఉత్పత్తులు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. స్థానికులకు ఉపాధి లభిస్తుంది. కారిడార్ ఏర్పాటును కేంద్ర మంత్రి బడ్జెట్లో ప్రస్తావించలేదు.
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయవచ్చని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నివేదిక ఇచ్చింది. ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలను నడిపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో కూడా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది.
జిల్లాలో పర్యటించిన అధికారుల బృందం ఎయిర్‌పోర్టు మైదానాన్ని పరిశీలించి సానుకూలంగా నివేదికలు అందజేసింది. విమానాశ్రయం నిర్మాణం వల్ల పరిసర ప్రాంతాలు భారీగా అభివృద్ధి చెందడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారడీని తలపిస్తుంది. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా కేటాయింపులు లేవు. ఆదిలాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్న సీసీఐ, టైక్స్‌టైల్ పార్క్, ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలేన్, గిరిజన యూనివర్శిటీకి నిధులు కేటాయించకపోవడం బాధాకరం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లాకు చిల్లిగవ్వ కేటాయించలేదు. బిహార్‌లో ఎన్నికలు జరగనుండగా ఆ రాష్ర్టానికి ఎక్కువ నిధులు కేటాయించారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను కేంద్ర మంత్రులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారు.
– మాజీ మంత్రి జోగు రామన్న
కేంద్ర బడ్జెట్లో సీసీఐ పునరుద్ధరణ, ఆర్నూర్-ఆదిలాబాద్ రైల్వేలేన్, గిరిజన యూనివర్శిటీ, వెనుకబడిన జిల్లాకు ప్రత్యేక ప్యాకెజీ, హైదరాబాద్-ఆదిలాబాద్ కారిడార్, విమానాశ్రయ నిర్మాణం వంటి విషయాల ప్రస్తావన లేదు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు నిధుల విషయంలో కేంద్ర మంత్రులకు ఒత్తిడి తీసుకురావాలి. పదకొండేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా జిల్లా ప్రజలు వరుసగా రెండు సార్లు బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల జరిగే రాష్ర్టాలకు ఎక్కువ నిధులు కేటాయించింది.
– బండారి సతీశ్, మాజీ కౌన్సిలర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపింది. బడ్జెట్ సవరణ కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టుబట్టాలి. జిల్లాకు చిల్లిగవ్వ ఇవ్వకపోవడం చూస్తుంటే బీజేపీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినా అవమాన పర్చారు. బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చినా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లేదు. సీసీఐని ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అమిత్‌షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇచ్చిన హామీలు నిలపెట్టుకోవాలి.
– దర్శనాల మల్లేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 1 : బడ్జెట్ లో పాత విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు. భారతదేశానికి సేవింగ్స్ ఆయువు పట్టువంటివి. పాత విధానంలో సేవింగ్స్, స్లాబ్రేట్స్ పెంచలేదు. కొత్త విధానంలో స్లాబును రూ.7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని హర్షిస్తు న్నాం. ఇది కొత్త విధానానికి వర్తిస్తుంది. కొత్త విధానంలోకి అందరిని తీసుకురావడానికి చేసిన ప్రయత్నంగా అనిపిస్తున్నది. ఇది చాలా తక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది.
– నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్.