ఆదిలాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తుల ప్రోత్సాహానికి చేయూతనందించి వారికి అండగా నిలిచింది. గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గొర్రెల పంపిణీ నిలిచిపోగా, చేప పిల్లలు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
ఏటా వానకాలంలో చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు చేరిన తర్వాత మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా.. సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదు. చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు చేరిన తర్వాత చేప పిల్లలను వదిలితే పిల్లలు పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జాప్యం కారణంగా నీరు వనరుల్లో నీరు ఎండిపోవడం కారణఁగా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకున్నది.
గతేడాది అంతంత మాత్రమే..
జిల్లాలో 95 మత్స్యకార సహకార సంఘాలు ఉండగా.. వీటిలో 4,500 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవం లో భాగంగా ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లల ఫలితంగా వీరికి ఉపాధి లభించింది. రెండేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో 224 చెరువుల్లో 1.23 కోట్ల చేప పిల్లలను వదిలింది. జిల్లాలోని సాత్నాల, మత్తడి ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో వేసిన చేప పిల్లలు బాగా పెరిగాయి. సకాలంలో పిల్లలు పంపిణీ చేయడంతోపాటు మ త్స్యకారులు చేపలు పట్టడానికి వలలు, ఇతర సామగ్రి, మార్కెటింగ్ కోసం ఫోర్, టూ వీల్లర్ వాహనాలను పంపిణీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేప పిల్లల పంపిణీ నీరుగారుతోంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 120 చెరువుల్లో 44 లక్షల చేప పిల్లలను వదిలినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వానకాలం సీజన్ అయిపోయిన తర్వాత పిల్లలను వదలడంతో నీటి వనరుల్లో నీరు ఎండిపోయి చేప పిల్లలు ఎదగకుండా పోయాయి. దీంతో మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. గతేడాది చేప పిల్లల పంపిణీ జాప్యం కావడంతో మత్స్యకారులు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేశారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం సగం చెరువుల్లో మాత్రమే చేప పిల్లలను వదలగా.. ఈ ఏడాది ఎలాంటి ఆదేశాలు రాలేదని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే ఉపాధి లభిస్తుందని వారు అంటున్నారు.
సగం పిల్లలు కూడా పంపిణీ చేయలేదు..
తాంసి మండలంలోని వడ్డాడి మత్త డి ప్రాజెక్టులో ఐదు గ్రామా లకు చెందిన 250 మంది మత్స్యకారులం చేపలు పడు తూ ఉపాధి పొందుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో 4.84 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. దీంతో మా ఉపాధి ఎంతో మెరుగు పడింది. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం 2.40 లక్షల పిల్లలను మాత్రమే సరఫ రా చేసింది. చేపపిల్లల రవాణాలో నిర్లక్ష్యం ఫలితంగా 80 వేలు చనిపో యాయి. అక్టోబర్ 25న పంపిణీ చేయడం తో పిల్లల ఎదుగుదల సరిగా లేక ఉపాధి నష్టపోయాం. ప్రభుత్వం స్పందించి నాణ్య మైన చేప పిల్లలను సకాలం లో పంపిణీ చేసి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం.
– మహేందర్, మత్స్యకారుడు, వడ్డాడి, తాంసి మండలం