ఆదిలాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తంగా మారింది. ఏడాది కిందట ప్రజలు ఈ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు. దీంతోపాటు ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేకు వచ్చిన సిబ్బందికి తమ వివరాలను తెలియజేశారు. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో కూడా ఫొటోలు దిగడంతోపాటు అధికారులు అడిగిన పత్రాలను అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయ కూలీలకు అందించే ఆత్మీయ భరోసా పథకాలు వస్తాయనే ఆశతో ఉన్న వారికి నిరాశే ఎదురైంది.
ప్రజాపాలనలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీతోపాటు గ్రామాల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు వందల సంఖ్యలోప్రజలు దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారుల సంఖ్య రెండు అంకెలు దాటకపోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. రేషన్‌కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా జాబితాల్లో తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులు అడుగుతున్నారు. అర్హులు, లబ్ధిదారుల జాబితా ప్రభుత్వం నుంచి వచ్చిందని తాము ఏమీ చేయలేమని అధికారులు సమాధానం ఇస్తున్నారు. మరోసారి దరఖాస్తు ఇవ్వాలని సూచిస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పేదలు మరోసారి దరఖాస్తులు ఇస్తున్నారు. దీంతో వార్డు గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాలోని రెండ్రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో గ్రామీణ మండలాల నుంచి 23,944 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రేషన్ కార్డుల కోసం 14,019, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5,359, ఆత్మీయ భరోసా కోసం 4,528, రైతు భరోసా కోసం 38 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా ఇప్పటి వరకు నిర్వహించిన వార్డు సభల్లో మరో ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చి ఉంటాయని అంచనా.
రెండ్రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న వార్డు, గ్రామసభల్లో నాలుగు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుంటున్న వారికి ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడం లేదు. దీంతో తాము దరఖాస్తు ఇచ్చినట్లు రుజువు ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు ఇస్తే రసీదులు ఇచ్చినా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, ఇప్పడు వస్తాయని నమ్మకం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని 35 వార్డు సభకు హాజరైన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ దరఖాస్తుదారులకు రసీదులు ఎందుకు ఇవ్వడం లేదని, కలెక్టర్‌తో ఈ విషయం మాట్లాడుతామని అన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో భాగంగా అర్హుల జాబితాను వార్డు, గ్రామసభల్లో ప్రదర్శిస్తున్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. జనం జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. రేషన్‌కార్డుల జాబితాలో అర్హులు, అనర్హులను ప్రకటించగా, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ఎవరికి ఇండ్లు వస్తాయనే స్పష్టత లేదు. సొంత జాగా ఉన్నా పక్కా ఇండ్లు లేని వారి జాబితాతో పాటు అద్దెకు ఉంటున్న వారి వివరాలు మాత్రమే ఉంటున్నాయి. ఈ జాబితాను చూసుకుంటున్న జనం తమకు ఇళ్లు మంజూరైందని అనుకుంటున్నారు. ఇండ్ల మంజూరు విషయంలో అధికారులను అడిగితే ప్రభుత్వం ఆయా నియోజకవర్గాలకు మంజూరు చేసి ఇండ్లకు అనుగుణంగా అర్హులకు ఇండ్లు మంజూరవుతాయని అంటున్నారు.