ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 2 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారసంత ఉంటుంది. సోమవారం ఉదయం మామిడిగూడ(జీ), మామిడిగూడ(బీ) గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కలిసి వారసంతకు వెళ్లారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలు కొనుగోలు చేసి సాయంత్రం తిరుగు పయనం అయ్యారు. అంజీ గ్రామపంచాయతీ పరిధిలోని ఆంద్ మామిడిగూడ గ్రామానికి వచ్చే సరికి రాత్రయింది.
మరోవైపు దాదాపు 10 సెంటీమీటర్లకుపైగా భారీ వర్షం కురుస్తుండడంతో మామిడిగూడ వాగు దాటలేక అంద్ మామిడిగూడ గ్రామంలోని ఓ ఆశ్రమంలో చలిలో పస్తులుండి గజగజ వణుకుతూ చలిమంటలు కాగుతూ అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం వాగు ఉధృతి తగ్గడంతో ముల్లె-ముట, పిల్లాపాపలతో కట్టెలు పట్టుకుని అతికష్టం మీద వాగు దాటి ఇంటికి చేరుకున్నారు.
ఈ మామిడిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.50 కోట్లు మంజూరు చేసిందని.. అధికారులు, మండల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు ప్రారంభించలేదని ఆదివాసులు ఆరోపించారు. కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా స్పందించి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.