నార్నూర్ : గ్రామంలో తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) మండలం బేతాల్ గూడ, సోనాపూర్ గిరిజనులు ఖాళీ బిందెలతో నిరసన ( Tribals protest ) చేపట్టారు. గ్రామంలో 140 కుటుంబాలుండగా 7 వందల మంది జనాభా నివాసం ఉంటుందని గ్రామస్థులు వివరించారు.
తాగు నీటి కోసం మిషన్ భగీరథ ద్వారా రెండు నీటి ట్యాంకులు, ఇంటింటా పైపులు, ట్యాపులు ఏర్పాటు చేసినా నేటికీ మిషన్ భాగీరథ( Mission Bhagiratha) నీరు అందకపోవడం విచారకరమని అన్నారు. బేతాల్ గూడలో ఒక చేతిపంపు, సోనాపూర్‌లో ఒక్క చేతి పంపు ఉంది. నీళ్ల కోసం ఈ చేతి పంపుల వద్ద స్థానికులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.

40 ఏళ్ల క్రితం తాగునీటి కోసం వ్యవసాయ బావి నుంచి ఉన్న పైప్ లైన్‌కు మరమ్మతులు చేయడానికి పంచాయతీ వద్ద నిధులు లేకపోవడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. నీటి కష్టాలు తట్టుకోలేక బుధవారం గిరిజనులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ జాదవ్ పరమేశ్వర్ ( Jadhav Parameshwar ) అక్కడికి చేరుకుని స్థానికులను సముదాయించారు. నీటి సమస్యని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు.