కుభీర్ : మార్చి 28 : తాగు నీటి కోసం గిరిజనుల ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఫకీర్ నాయక్ తండా మహారాష్ట్ర సరిహద్దులోని మారుమూల గిరిజన గ్రామం. ఈ తండా వాసులకు గత కొంతకాలంగా తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. దీనికి కారణం మిషన్ భగీరథ ట్యాంకు లోకి నీరు చేరకపోవడంతో తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి కోసం ఒకరిద్దరి ఇండ్లలోని బోరు బావుల వద్దకు వెళ్లి బతిమాలి తాగునీరు తెచ్చుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మిషన్ భగీరథ ట్యాంకు నీరు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పటికి గ్రామంలో భూమి లోపల నుండి వేసిన పైప్ లైన్లు సైతం పగిలిపోతున్నట్లు గ్రామస్తులు వివరిస్తున్నారు.
గుట్ట పై ఉన్న ఎత్తైన ప్రదేశంలో నీటి ట్యాంకులు నిర్మించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఒకే ఒక్క చేతి పంపు ఉంది. బిందెడు నీళ్లు కావాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యపై అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని మాజీ సర్పంచ్ గోపీచంద్ జాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గిరిజన తండా వాసుల కన్నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.