కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కెరమెరి, ఫిబ్రవరి 16 : అడవిబిడ్డలకు సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘గిరి వికాసం’పై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బోర్లు వేసి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు కరెంట్ మోటర్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నది.
ఒక్కో యూనిట్‌కు రూ.3.50 లక్షలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ‘గిరి వికాసం’ పథకం కోసం ప్రత్యేకంగా సర్వేలు చేపట్టిన అధికారులు.. దానిని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. గతంలో ఇందిర జలప్రభ పేరుతో ఉన్న ఈ పథకాన్ని ఆపై ‘గిరి వికాసం’తో పేరుతో అమలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 3.50 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. పదెకరాలకో యూనిట్‌ను అమలు చేస్తున్నారు. ఐదెకరాలు కలిగిన ఇద్దరు రైతులు.. లేక అంతకంటే తక్కువ భూమి కలిగిన ముగ్గురు రైతులకు కలిపి ఒక యూనిట్‌ను అమలు చేస్తున్నారు.
కేవలం 13 యూనిట్లే..
ఇందిర జల ప్రభ (గిరి వికాసం) పథకం కింద 169 యూనిట్ల కోసం రూ. 92 లక్షల దాకా ఖర్చుచేశారు. రైతుల చేల వద్ద 482 బోరుబావులను తవ్వించారు. విద్యుత్ లేన్ల ఏర్పాటు కోసం రూ. కోటీ 78 లక్షలు కూడా కేటాయించారు. కానీ ఆపై విద్యుత్ లేన్లు గాని, మోటర్లుగాని ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకు మొత్తంగా 13 యూనిట్లు మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేశారు. మిగతా వాటికి విద్యుత్ కనెక్షన్లు, మోటర్లు ఏర్పాటు చేయకపోవడంతో బోర్లన్నీ నిరుపయోగంగా మారాయి. దీనికి తోడు అటవీ ప్రాంతంలో ఉండే వ్యవసాయ భూములకు విద్యుత్లేన్లు వేసేందుకు అటవీశాఖ ఆంక్షలు విధించడం కూడా గిరి వికాసం పథకం అమలుకు అడ్డంకిగా మారాయి.
బోరు మాత్రమే వేశారు
గిరివికాసం పథకం కింద నాతో పాటు నా నా చేను పక్కన ఉన్న టేకం జల్పత్రావ్ను ఎంపిక చేశారు. మా ఇద్దరికి కలిపి పదెకరాలు ఉంది. వాటికి నీరందించేందుకు నా చేనులో బోరు వేశారు. కానీ ఇంతవరకు విద్యుత్ లేన్ ఏర్పాటు చేయలేదు. మోటారు కూడా బిగించలేదు. కరెంటు కనెక్షన్ ఇవ్వాలని అనేకసార్లు అధికారులను కలిశాం. కానీ పట్టించుకోలేదు. ప్రస్తుతం వర్షాలపై ఆధారపడి మాత్రమే పంటలు వేస్తున్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి మా చేనులో వేసిన బోరుకు విద్యుత్లేన్ వేయాలి. మోటారు బిగించాలి.
– టేకం రాంషావ్, గిరివికాసం లబ్ధిదారుడు, కెరమెరి
బోరున్నా నీళ్లుపెట్టుకోలేక పోతున్నం
నా చేను పక్కనే మా అమ్మ చేను కూడా ఉంది. గిరి వికాసం పథకం కింద మా ఇద్దరికి కలిపి బోరు వేశారు. మా చేనుకు విద్యుత్ లేన్ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు మోటర్ ఇవ్వలేదు. బోరున్నా పంటలకు నీరు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇంకా కొన్నేళ్లు ఆగితే బోరు కూడా కూలిపోయే అవకాశమున్నది. ఇప్పటైనా అధికారులు స్పందించాలి.
– కుడిమెత దౌలత్‌రావు, గిరివికాసం లబ్ధిదారుడు, కెరమెరి