మంచిర్యాల టౌన్, నవంబర్ 28 : మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రయాణం కష్టంగా మారింది. ముఖ్యంగా లక్ష్మీటాకీసు, వెంకటేశ్వర టాకీసు చౌరస్తాల వద్ద జంక్షన్లు కూల్చివేయడంతో రాకపోకలకు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఐబీ చౌరస్తా నుంచి మందమర్రి, బెల్లంపల్లి వైపునకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారిని ఆనుకుని ఇరుపక్కలా పలు కాలనీలున్నాయి. ఈ ప్రాంత వాసులు తమ వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలు సైతం ఈ రోడ్డుపై నుంచి వెళ్తుంటాయి.
నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా ఉండడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐబీ నుంచి లక్ష్మీటాకీసు వరకు నాలుగుచోట్ల రూ. నాలుగు కోట్లు వెచ్చించి జంక్షన్లను నిర్మించింది. వాటిని ఎంతో ఆకర్శనీయంగా, సుందరంగా తీర్చిదిద్దింది. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహంతో పాటు, పార్లమెంట్ భవనాన్ని పోలిన ప్రతిమ, వెంకటేశ్వర టాకీసు చౌరస్తాలో వివిధ కుల వృత్తుల వారికి సంబంధించిన నమూనాలు, బెల్లంపల్లి చౌరస్తాలో త్రివిధ దళాలకు చెందిన ప్రతిమలు, లక్ష్మీటాకీసు చౌరస్తాలో పలు పక్షులు, సీతాకోక చిలుకలకు సంబంధించిన బొమ్మలు ఏర్పాటు చేసింది.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాకముందే లక్ష్మీటాకీసు, వెంకటేశ్వర టాకీసు జంక్షన్లను కూల్చివేశారు. వీటి స్థానంలో చిన్న సైజులో జంక్షన్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. జంక్షన్లను కూల్చి ఆరు నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంపై పట్టణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జంక్షన్లను కూల్చిన ప్రాంతంలో వాహనాలు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందంటున్నారు.