ఖానాపూర్ : ఖానాపూర్ మున్సిపాలిటీలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య ( Traffic problems ) తీవ్రంగా ఉంది . పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలోని ఖానాపూర్(Khanapur) -నిర్మల్( Nirmal) జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ ఉండటంతో గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచాయి. దీంతో ప్రజలు, వ్యాపారస్థులు ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్షాల కారణంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిర్మల్ -హైదరాబాద్ రోడ్డు నిలిపివేసి వాహనాలను ఖానాపూర్ మీదుగా జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్కు మళ్లించారు. దీంతో ఖానాపూర్ పట్టణంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భారీ కంటైనర్లు సరైన మార్గం తెలియకపోవడంతో పట్టణంలోని పలు కాలనీ గుండా వెళ్లాయి. రహదారి పొడవున వాహనాలు నిలవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది.
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన చౌరస్తాలో సిగ్నల్ ఏర్పాటుతోపాటు కనీసం హోంగార్డునైనా నియమించలేదని వాహనాదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.