ఆదిలాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణ కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఆర్వోబీ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.97.20 కోట్ల అంచనాతో చేపట్టాయి. ఇందులో రాష్ట్రం వాటా రూ.57.20 కోట్లు, కేంద్రం వాటా రూ.39.49 కోట్లుగా నిర్ణయించారు. వంతెన పొడువు 931.825 మీటర్లు.
మూడేండ్ల కిందట పనులు ప్రారంభమయ్యాయి. రైల్వేట్రాక్ భాగంలోని పనులను రైల్వేశాఖ, మిగతా పనులను రోడ్లు భవనాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వంతెన నిర్మాణంలో భాగంగా స్పిన్నింగ్ మిల్లు క్రాసింగ్ నుంచి వరకు 30 పిల్లర్లు వేసి స్లాబులు పూర్తి చేశారు. ఎల్ఐసీ కార్యాలయం వైపు 220.512 మీటర్ల వంతెన నిర్మించాల్సి ఉండగా.. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచాయి.
వాహనదారుల ఇబ్బందులు
తాంసి బస్టాండ్ వద్ద రైల్వే కింద వంతెనను రూ.20 కోట్లతో నిర్మించాల్సి ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయం నుంచి పంజాబ్ చౌరస్తా వరకు 292 మీటర్ల పనులు జరగాలి. వంతెన పనుల నిర్మాణంలో భాగంగా రోడ్డుకు రెండు పక్కల ఉన్న ప్రైవేటు దుకాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. వీరికి పరిహారం రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.పట్టణంలోని రెండు రైల్వే క్రాసింగ్‌లు తాంసి బస్టాండ్, స్పిన్నింగ్ మిల్లు వద్ద ఉన్నాయి.
జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లతోపాటు గూడ్స్ ట్రెయిన్లు వస్తుంటాయి. దీంతో రోజు 20 నుంచి 30 సార్లు గేటు పడుతుంది. ఆదిలాబాద్ పట్టణంతో తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాలు, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే క్రాసింగ్‌లు దాటాల్సి వస్తున్నది. తరచుగా గేటు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది, విద్యార్థులు, అంబులెన్స్‌లు నిలిచిపోవాల్సి వస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.