కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు రాష్ట్ర క మిటీ సభ్యుడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అ డవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జి ల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అడెల్లు 2020 జూన్‌లో ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించి మావోయిస్టు పార్టీల్లో యువకులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు. తిర్యాణి అటవీ ప్రాం తంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ దళాలు, ఇతర ప్రత్యేక పోలీసుల బలగాలకు మూడుసార్లు ఎదురుపడి తృటిలో తప్పించుకున్నారు.
2020 సెప్టెంబర్‌లో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ అటవీ ప్రాంతంలోని చేలల్లో పోలీసులకు తారసపడి తృటిలో త ప్పించుకుపోయారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాలో ఆరు రోజుల పాటు మకాం వేసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దాదాపు మూడు నెలల పాటు గ్రే హౌండ్స్ దళాలు అడవులను జల్లెడ పట్టినప్పటికీ మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ పోలీసులకు చిక్కలేదు. ఈ ఘటనలు జరిగిన మూడు నెలలకు 2020 సెప్టెంబర్ 19న కాగజ్‌నగర్ ఈస్గాం పోలీస్టేషన్ పరిధిలోని కదంబా అడవుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు.
ఈ కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన మావోయిస్టు చుక్కాలు, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాజీరావు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో కూడా మైలారపు అడెల్లు చాకచక్యంగా తప్పించుకున్నట్లు పోలీసులు భావించారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం ఈయనపై రూ. 25 లక్షల రివార్డును ప్రకటించింది.
బోథ్, జూన్ 6 : మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతితో ఆయన స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంపొచ్చెర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1996-97లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆర్ఎస్యూ (రాడికల్ స్టూడెంట్ యూనియన్)కు ఆకర్షితుడై అప్పటి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. మావోయిస్టు పార్టీలోని ఓ కీలక మహిళా నేతను పెండ్లి చేసుకున్నారు.