కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు అడవిబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే అడవిబిడ్డలకు పట్టాల పంపిణీ నిలిపివేయడం.. దీనికి తోడు గిరిపుత్రులను అడవులకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో వారి మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. కేసీఆర్ హయాంలో మన ఊరు-మన బడి ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. పైగా 33 గ్రామాల్లోని గిరిజన సంక్షేమ పాఠశాలలు మూతబడే పరిస్థితి దాపురించగా, చదువు అందని ద్రాక్షలా మారనున్నది. ఇక అనేక గ్రామాలకు రోడ్లు, వంతెనలు లేక ప్రయాణం నరకప్రాయమవుతున్నది. వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటాల్సిన దుస్థితి నెలకొన్నది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం..
దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం ఏడాదిగా నిలిచిపోయింది. ఆదివాసీలను అడవులకు దూరం చేసేలా అధికారులు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,177 మంది గిరిజన రైతులకు 51,859 ఎకరాలకు పోడుపట్టాలు అందించారు. ఇంకా జిల్లాలో 25 వేలకు పైగా రైతులకు పోడు పట్టాలు అందించాల్సి ఉంది. 2005లో వచ్చిన అటవీ హ క్కుల చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు హక్కులు కల్పించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోడు పట్టాల పంపిణీ నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి దాపురించింది.
జిల్లాలో అడవి బిడ్డలు అక్షరాలకు దూరమవుతున్నారు. 33 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూత వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సైతం ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంగ్ల విద్యపై నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పైగా గిరిజన గ్రామాల్లోని పాఠశాలలే మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నేలమీద కూర్చొని భోజ నం చేయాల్సిన పరిస్థితి ఉన్నది.
కాలినడక కూడా సాధ్యంకాని ఈ దారిలో త న తల్లిదండ్రులతో కలిసి వస్తున్న ఈ గర్భిణి పేరు కల్పన. కెరమెరి మండలం పరస్వాడ గ్రామం నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం రాళ్లు.. రప్పలు కలిగిన గుట్టపై నుం చి కేలి(బీ) అనే గ్రామం వరకు నడిచి వచ్చిం ది. అక్కడి నుంచి ఎడ్ల బండిలో కెరమెరి ప్రాథమిక ఆరోగ్యాకేంద్రానికి అతికష్టం మీద చేరుకున్నది. జిల్లాలో ఇలాంటి గిరిజన గ్రామాలు అనేకం ఉన్నాయి. రోడ్లు, వంతెన లు లేకపోవడంతో వర్షాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు.. వంకలు దాటాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం అడవిబిడ్డల గోడు పట్టించుకోదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.