తాండూర్/మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 9 : పితృ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పూల పండుగ వేడుకలు గురువారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలకు వాడవాడనా ఏర్పాట్లు చేశారు. ఆడబిడ్డలు తల్లి గారింటికి చేరుకోగా, ఉద్యోగ, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకున్నారు.
మార్కెట్లో సందడి..
జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోని మార్కెట్లలో వెలిసిన పూల దుకాణాల వద్ద మహిళల సందడి నెలకొన్నది. బంతి, చామంతి, గునుగు, తంగెడు, తదితర పూలను మహిళలు కొనుగోలు చేశారు. ఈ సారి పూల రేట్లు ఆకాశాన్నంటాయి. మరోవైపు బట్టల షాపులు, కంగన్‌హాల్, కిరాణా షాపుల్లో రద్దీ కనిపించింది. మార్కెట్ ఏరియాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వాగులు, చెరువులు, కుంటలు, గోదావరి, ప్రాణహిత నదీ తీరాల్లో ఘాట్ల వద్ద బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. పారిశుధ్య పనులు చేపట్టి ఫ్లడ్ లైట్లు, మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. రక్షణ చర్యల కోసం గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
అమెరికాలో బతుకమ్మ సంబురాలు
జన్నారం, అక్టోబర్ 9 : మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని రాంపూర్, మంచిర్యాల పట్టణానికి చెందిన మహిళలు బతుకమ్మ వేడుకలను అమెరికాలోని టెక్సస్ స్టేట్‌లోని ఆస్టిన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండలం రాంపూర్‌కు చెందిన పాలెపు ప్రసాద్‌రావు, మంచిర్యాలకు చెందిన మిట్టపెల్లి ప్రణవీకిశోర్ కుటుంబ సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.