మంచిర్యాల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. సమయం రానే వచ్చింది. నేడు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ సైన్ంయ కదులుతున్నది. ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల మంది తరలించాలనుకున్నా, అంతకు మించి బయలుదేరుతున్నారు. ఒక్కో నియోజకవ ర్గం నుంచి 60 నుంచి 70 బస్సులు, 30 నుంచి 40 కార్లు ఏర్పాటు చేయగా, నాయకత్వం శ్రేణుల ను క్షేమంగా చేర్చేందుకు శ్రద్ధ చూపుతున్నది.
రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. దానిని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పలు కార్యక్రమాలు నిర్వహించి.. పార్టీ శ్రేణులను సమీకరించి సభ జయప్రదంపై చర్చించారు. వివిధ వాహనాలను సమకూర్చారు. భోజన వసతితో పాటు తాగు నీటి సౌకర్యం కల్పించారు. శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో వారిని తిగిరి క్షేమంగా ఇళ్లకు చేర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పగించారు.
రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శని వారం మందమర్రిలో భారీ బైక్ ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బైక్ ర్యాలీ తీశారు.
ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామస్తులు శనివారమే బయల్దేరి వెళ్లారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా గులాబీ జెండాలు పట్టుకొని సభకు తరలి వెళ్లడం కనిపించింది. దీంతో ఒక రోజు ముందుగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రజతోత్సవ సభ జోష్ కనిపించింది. గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాలన్నీ గులాబీమయ మయ్యాయి.