కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/కౌటాల, డిసెంబర్ 6 : మహారాష్ట్రలోని తడోబా, కనర్గాం ఫారెస్ట్‌లో పులులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అన్నారు. జిల్లాకు పులుల రాకపోకలు పెరగడం.. ఇటీవల జరిగిన పలు ఘటనల నేపథ్యంలో శుక్రవారం సిర్పూర్-టీ మండలం మాకిడి – జక్కాపూర్ అటవీ ప్రాం తంలో స్టేట్ వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ ఈలుసింగ్ మేరు, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌తో కలిసి మహారాష్ట్ర అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలోని తడోబా, తి ప్పేశ్వర్ టైగర్ రిజర్వులలో పులులు పెద్ద సం ఖ్యలో ఉండడం, వాటిని ఆనుకొని ఉన్న ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లోకి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు.
మహారాష్ట్రలో పులుల సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటి పర్యవేక్ష ణ ఎలా ఉందనే విషయాలను మహారాష్ట్ర అ టవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పులుల నుంచి మనుషులను రక్షించేందుకు, అడవులు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారని అడిగారు. మహారాష్ట్రలో పులి దాడులు ఎ క్కువగానే ఉన్నాయని, మనుషులతో పాటు పశువుల యజమానులకు కూడా నష్టపరిహా రం మెరుగ్గా ఇస్తున్నామని చంద్రాపూర్ జిల్లా అటవీ అధికారి అవదూర్ వార్ వివరించారు. పశువులు పులి దాడిలో చనిపోతే మార్కెట్ రే టును బట్టి పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు.
పులుల సంరక్షణలో స్థానిక ప్రజలను భా గస్వాములను చేస్తున్నామని, ప్రతి గ్రామంలో ప్రైమరీ రెస్క్యూ టీంలను ఏర్పాటు చేశామని, వీరంతా పులికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారని అధికారులు వివరించారు. డోబ్రియాల్ మాట్లాడుతూ తెలంగాణ- మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. తెలంగాణలోని కాగజ్‌నగర్ సహా మిగిలిన ప్రాంతాల్లో ఆడ పులులు ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల పరిశీలనలోకి వచ్చిందన్నారు. కాగా, మీటింగ్ ఏర్పాటు చేసిన చోట మెయిన్ రోడ్ మీద పులి మలాన్ని అధికారులు గుర్తించడం గమనార్హం. ఈ సమావేశంలో చంద్రాపూర్ సబ్ డీవో సాహు, దాబాద్ ఆర్ఎఫ్వో గౌర్ కౌర్, బయాలజిస్ట్ ఏల్లంపాల్గొన్నారు.