కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో పులి దడ మొదలైంది. యేటా నవంబర్, జనవరి నెలల్లో అవి కలుసుకునే సమయం కాగా, సంచారం ఎక్కువగా ఉంటోంది. కానీ, ఈసారి మాత్రం అక్టోబర్‌లోనే వాటి అలజడి కనిపిస్తున్నది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దాడులు చేయగా, యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు చర్య లు చేపడుతున్నది. అటవీ సమీప గ్రామాల్లో డప్పు చాటింపుల ద్వారా ప్రజానీకాన్ని హెచ్చరిస్తున్నది.
నవంబర్ నుంచి జనవరి వరకు..
జిల్లాలో సాధారణంగా యేటా నవంబర్ నుంచి జనవరి వరకు పులి సంచారం ఎక్కువగా ఉంటోంది. పులులు సంక్రమించే సమయం కావడంతో మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరుగుతుంటాయి. జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాయి. గతంలో ఇదే సీజన్లో పులులు దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గత నాలుగైదు ఏళ్లుగా పశువులపై దాడులు పెరుగడంతో పాటు వ్యవసాయ కూలీలపై కూడా దాడులు జరిగాయి. ఇదే క్రమంలో పులుల దాడుల్లో పలువురు మృత్యువాత పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి.
వారం వ్యవధిలో రెండు పశువులపై దాడి
కాగజ్‌నగర్ డివిజన్లో వారం వ్యవధిలో రెండుచోట్ల పశువులపై పులులు దాడులు చేశాయి. సిర్పూర్-టీ మండలం చీలపల్లిలో అక్టోబర్ 3న ఏల్పుల తిరుపతికి చెందిన లేగదూడపై పులి దాడి చేయడంతో మృత్యువాత పడింది. అక్టోబర్ 10న జునుగురె శివరాంకు చెందిన ఎద్దుపై పులిదాడి చేసి చంపేసింది. 13న దహెగాం మండలం బీబ్రా అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ అధికారుల అప్రమత్తం
కాగజ్‌గనర్ అటవీ డివిజన్లో పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులి సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందనే విషయంతో పాటు పులి ఎక్కడకు వెళ్తుందో ట్రాక్‌చేస్తున్నారు. పులి సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు పులి వలన పశువులు, మనుషులకు ఎలాంటి హాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సంచారం ఎక్కువగా ఉన్న సిర్పూర్-టీ మండలం మాకిడి, చీలపల్లి, కాగజ్‌నగర్‌లోని పెద్దరాస్పల్లి, సర్సాల, అనుకోడ, దహెగాం మండలం బీబ్రా, మొర్లిగూడ తదితర ప్రాంతాల్లో డప్పు చాటింపులు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు పత్తి ఏరుకునే సమయం కావడంతో రైతులు, వ్యవసాయ కూలీలు చేలల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి. పులుల సంచారం కూడా పెరుగుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రాకూడదని సూచిస్తున్నారు.