మంచిర్యాల, మే30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవికోసం పట్టుబడుతుండగా, తాజాగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ తమ సన్నిహితులను బరిలో దింపేందుకు పోటీ పడడం చర్చనీయాంశమవుతున్నది. బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఒక్కటై కాసిపేట మాజీ ఎంపీపీ విక్రమ్‌రావును బలపరుస్తుండగా, ఎమ్మెల్యే పీఎస్సార్ మాత్రం తన తమ్ముడు సత్యపాల్‌ను బరిలో దింపేందుకు ఆసక్తి చూపడం గందరగోళానికి దారితీస్తున్నది.
జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు నాయకుల మధ్య సఖ్యత లోపించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రిపదవి కోసం పట్టుబడుతుండగా, ఒకరంటే ఒకరికి పడటం లేదు. బహిరంగంగానే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటుండగా, ఆ పార్టీ గందరగోళం నెలకొంటుంది. పార్టీ కోసం కష్టపడ్డానని.. తనకే గుర్తింపు ఇవ్వాలని, తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఇటీవల జరిగిన బహిరంగ సభలో మంత్రులు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబుల సమక్షంలో మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడారు. నిన్న..మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని, ఒకే కుటుంబానికి మూడు పదవులు ఎలా ఇస్తారంటూ.. కాకా కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
అదే స్థాయిలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌లు సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానిది విడదీయరాని అనుబంధమని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అంటే.. బీజేపీలో ఉంటే కేంద్రంలో పదవి వచ్చేదని, తనను కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్‌రెడ్డి రమ్మంటేనే వచ్చానని.. మంత్రి పదవిపై హామీ ఉందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కౌంటర్ ఇచ్చారు. గతంలో జరిగిన ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును బహిర్గతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి విషయంలో ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య పోటీ నెలకొంది.
రాష్ట్రస్థాయి నుంచి మొదలుపెడితే కేంద్రస్థాయి దాకా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మంత్రి పదవి మాకే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిపోయింది. ప్రతి విషయంలో ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పోటీ పడుతున్నారు. మొన్నటికి మొన్న ఎంపీ వంశీకృష్ణ వర్గాన్ని మంచిర్యాలలో నిరసన తెలపకుండా పీఎస్సార్ వర్గం నాయకులు అడ్డుకున్నారు.
తాజాగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం గడ్డం వివేక్, వినోద్ ఒక్కటయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మాబొజ్జుతో కలిసి కాసిపేట మాజీ ఎంపీపీ విక్రమ్‌రావును బలపరుస్తున్నట్లు బెల్లంపల్లిలో శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. కాగా, ఇదే గుర్తింపు సంఘం ఎన్నికల కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తన తమ్ముడు సత్యపాల్రావును బరిలోకి దించనున్నారు. దీంతో మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు బహిర్గతమైంది. కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సైతం ఓరియంట్ సిమెంట్ ప్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే మూడు వర్గాలు పోటీలో నిలవనుండడంతో ఏం జరుగుతుందో అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిందే నలుగురు ఎమ్మెల్యేలు. అందులో ముగ్గురు మంచిర్యాల జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తుంటే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి వెడ్మా బొజ్జు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులు ఎవరికి వారు తీవ్రప్రయత్నాలు చేస్తూ వర్గాలుగా విడిపోయారు. ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఈ నలుగురు ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. బె ల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు వినోద్, వివేక్‌తో ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జతకట్టారు.
ముగ్గురు కలిసి ఓ అభ్యర్థిని బలపరిచారు. దీంతో పీఎస్సార్ ఒంటరైపోయారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి పదవి విషయంలోనూ బొజ్జు గడ్డం ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తున్నారనే ఉహాగాహానాలు వినిపిస్తున్నా యి. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తే నలుగురు ఎమ్మెల్యేలు కలిసి ఒకరిని నిలబెట్టాలి. అలా కాకుండా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ వ్యక్తిని బలపరుస్తున్నట్లు ప్రకటించారు. డీసీసీ అధ్యక్షురాలిగా పీఎస్సార్ భార్య కొక్కిరాల సురేఖ ఉండగా.. ఆమెతో గానీ, మంచిర్యాల ఎమ్మెల్యేగానీ సంబంధం లేకుండా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడం హస్తం పార్టీలో కలకలం రేపుతున్నది. దీనిపై పీఎస్సార్ ఎలా స్పందిస్తారన్నది తీవ్రచర్చనీయాంశంగా మారింది.
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై లేబర్ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 5న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 11 గంటలకు అన్ని యూనియన్లతో సమావేశం కానున్నది. అన్ని యూనియన్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల తేదీలను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. యాజమాన్యం మార్పు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాలను లేబర్ కమిషన్ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది. జూన్ 5న జరిగే మీటింగ్‌తో ఎన్నికలపై క్లారిటీ రానున్నది.