మంచిర్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలపై సర్కారు పర్యవేక్షణ కొరవడింది. రేవంత్ సర్కారు వచ్చిన 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు. నిన్న(మంగళవారం) నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే(ఎంజేపీ)లో తొమ్మిదో తరగతి విద్యార్థి షేక్ అయాన్ హుస్సేన్ పిట్స్ రావడంతో మృతిచెందాడు.
వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విష ఆహారం తిని అస్వస్థతకు గురైన చౌదరి శైలజ సీరియస్ కండీషన్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విష ఆహారం ఘటనను మర్చిపోకముందే బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం పెట్టిన కిచిడీ తిన్న పదో తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థినులు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఇలా.. ఉమ్మడి జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలు తల్లిదండ్రుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. చదువుకోవడం కోసమని ఇల్లు విడిచి హాస్టళ్లకు వెళ్లిన తమ పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు.
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికారులు రెగ్యూలర్ తనిఖీలు నిర్వహించకపోవడంతో ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీయగా.. ప్రిన్సిపాల్ మాధవ్ ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా సెలవు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సీరియస్ అయిన ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆయనను సస్పెండ్ చేశారు.
పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, వార్డెన్లకు విధుల విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉంటున్నారో.. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందనేది ఈ ఘటనతోనే తెలిసిపోతుంది. ఉన్నతాధికారులకు తెలియకుండా పాఠశాల ప్రిన్సిపాల్ అనధికారిక లీవ్‌లో వెళ్లడం ఏంటి.. ఇది ఈ ఒక్క పాఠశాలలో జరుగుతుందా లేకపోతే గిరిజన ఆశ్రమ పాఠశాలల అన్నింటిలో జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అన్ని పాఠశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధులను నిర్లక్ష్యం చేసే ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్‌కు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
మంచిర్యాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులు, వైద్యులతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన అందరూ పదో తరగతి విద్యార్థినులని, అంతా స్నేహితులని చెప్పారు. బయటి నుంచి ఏదైనా తీసుకొచ్చి తిన్నారా అంటే తినలేదనే చెప్పారని.. కాకపోతే విద్యార్థులు తిన్న ఆహారం ఫుడ్ శాంపిల్స్‌తోపాటు పాఠశాలలోని తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపించామన్నారు.
ఆ ఫలితాలు వచ్చాక ఎవరైనా తప్పు చేసినట్లు తేలిసే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగలకు ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థినులు బయటి నుంచి ఏదైనా ఫుడ్ తీసుకువచ్చారా చెక్ చేయాలని వార్డెన్లను ఆదేశించామన్నారు. ప్రత్యేక వైద్య సిబ్బందితో పిల్లలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇదే విషయంపై ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఖుష్బూ గుప్తా స్పందిస్తూ.. ఇంటి నుంచి తెచ్చిన పచ్చడి కిచిడీలో కలుపుకుని తినడంతో ఇబ్బంది వచ్చిందని చెప్పారు. పిల్లలు తిన్న ఆహారంతోపాటు ఆ పచ్చడి శాంపిల్స్‌ను టెస్టులకు పంపామన్నారు.
ఫలితాలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు మాత్రం ఉడకని లూస్‌గా ఉన్న కిచిడీతోపాటు చింత పులుసు పెట్టారని తెలిపారు. హాస్టల్లో వండే ఆహారం పూర్తిగా ఉడకకుండానే పెడుతున్నారని, రోజూ ఇదే పరిస్థితి ఉందని వాపోయారు. మరీ ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే మడావి గంగోత్రి(14) వాంతులు, విరేచనాలు చేసుకుని మృతి చెందింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చూపించి వైద్యుల సూచనల మేరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. కాగా.. గంగోత్రి పాఠశాల బాత్రూమ్లోనే స్పృహతప్పి పడిపోయి చనిపోయిందని.. పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోతే ఆమె మృతి చెందేది కాదంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
– ఈ ఘటన అక్టోబర్ 26, 2024న జరిగింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు కారణమైన హెచ్‌ఎంతోపాటు వార్డెన్‌ను విధుల నుంచి తొలగించాలి. పాఠశాల పర్యవేక్షణలో విఫలమైన ఏటీడీవో, డీటీడీవోలపైనా చర్యలు తీసుకోవాలి. వరుస ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలుండాలి. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం.
-డి.శ్రీకాంత్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయి జన్ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవ హరిం చిన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవా లి. ఎవరినీ ఉపేక్షించొద్దు. కేసీఆర్ ప్రభు త్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన గురుకు లాలను దెబ్బతీయాలనే కుట్రతోనే కాంగ్రెస్ సర్కారు వాటిని పట్టించుకో వడం లేదు. హరీశ్‌రావు వెళ్లి పరామర్శిం చే వరకు వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు భరోసా ఇచ్చే దిక్కు లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి, విధులను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి. గురుకులాలను, ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేయాలి.
– శ్రావణ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 75 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం చౌదరి శైలజ అనే విద్యార్థిని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య పోరాడుతున్నది.
– అక్టోబర్ 31, 2024న జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) మైనార్టీ గురుకుల విద్యార్థి అర్బస్ మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అప్పస్ అనే విద్యార్థి దాడి చేయడంతో ఆ విద్యార్థి మృతి చెందాడు. గురుకులంలో విద్యార్థులు గొడవ పడేది. కొట్టుకునేది అధికారులకు తెలియలేదా? వారి నిర్లక్ష్యంతోనే అర్బస్ మృతి చెందాడనే ఆరోపణలున్నాయి.
– ఈ ఘటన ఫిబ్రవరి 8, 2024లో జరిగింది.