సోన్, అక్టోబర్ 13 : ఈ యేడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, సన్న రకాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సన్నరకాల వైపు మొగ్గు చూపారు. జిల్లాలో దాదాపు 70,500 ఎకరాలు సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో మొన్నటి వరకు వరి పైరు పచ్చగా, ఏపుగా వస్తుండడంతో దిగుబడులు బాగానే వస్తాయని రైతులు భావించారు. ఈ తరుణంలో 20 రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో సన్నరకం వరి పైరుకు ఎండకు తెగులు, దోమపోటు వస్తుండడంతో ఏమి చేద్దామన్న ఆలోచనలో పడ్డాడు. మొన్నటివరకు మంచి దిగుబడులు వస్తాయనుకుంటున్న తరుణంలో ఈ తెగులు పొట్ట దశలో సోకుతుండడంతో ఏమి చేద్దామన్న ఆలోచనలో పడ్డాడు. మొన్నటి వరకు బాగా ఉన్న పంట ఒక్కసారిగా ఎండు తెగులు సోకవడంతో డ్రోన్లతో మందును పిచికారీ చేస్తున్నారు. అయినప్పటికీ దిగుబడి తగ్గుతుందని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నత్రజని ఎరువులను తక్కువ వాడినప్పటికీ ఎండు, అగ్గి తెగులు, దోమపోటు ఎలా సోకాయోనని దిగులు చెందుతున్నారు. ఏ మందును పిచికారీ చేస్తే తగ్గుముఖం పడుతుందోనని తెలుసుకోవడానికి దుకాణాదారులు, వ్యవసాయశాఖ అధికారుల వద్దకు రైతులు వెళ్తున్నారు. ప్రస్తుతం ఎకరానికి కనీసం రూ.25 వేలు పెట్టుబడి పెట్టగా ఎలా వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
ధర మంచిగా ఉంటదని మొత్తం పదెకరాల్లో సన్న రకం వరి వేశా. మొన్నటి వరకు వరి పైరు బాగా ఉండడంతో దిగుబడి బాగా వస్తుందన్న నమ్మకం ఉండే. ఇప్పుడు వరి రోజురోజుకు ఎండు తెలుగు సోకవడంతో రెండు సార్లు డ్రోన్‌తో మందును పిచికారీ చేశా. పెట్టిన పెట్టుబడి వస్తాదో లేదోనన్న నమ్మకం లేదు.
రైతులు పంటకు తెగులును గమనించి మందును పిచికారీ చేసుకోవాలి. ఎండు తెగులు నివారణకు ఎకరాకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 500 గ్రాములు, ప్లాంటామైసిన్ 100 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ట్రైక్లోజోల్ 120 గ్రాము ఎకరానికి పిచికారీ చేయాలి. దీంతోపాటు దోమపోటుకి పైమెట్రోజైన్(50 శాతం డబ్ల్యూజి) 120 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.