కెరమెరి, ఏప్రిల్ 7 : పార్లమెంట్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతిపౌరుడు సహకరించాలని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య కోరారు. ఆదివారం మండలంలోని ఝరి, మోడీ గ్రామాల్లో ఎస్పీ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు సీఆర్పీడీవైఎస్పీ రాకేశ్, వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నియమ నిబంధనాలు పాటించాలని సూచించారు.
కుల మతాలకు అతీతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, ఎవరైనా కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్యాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు లేకుంటే ఈ నెల 15వ తేదీలోగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుందని, ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. సంఘ విద్రోహ శక్తులకు ఎట్టిపరిస్థితుల్లో సహకరించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే 100 నంబర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.