ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో దివ్యాంగులైన చిన్నారుల బంగారు భవిష్యత్‌కు వీటి ద్వారా భరోసానిస్తున్నది. వైకల్యాన్ని జయించి, వారు జీవితంలో రాణించేందుకు మార్గం చూపుతున్నది. నిర్మల్ జిల్లాలో 18 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1307 మంది దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
-సారంగాపూర్, సెప్టెంబర్ 9
సారంగాపూర్, సెప్టెంబర్ 9 : ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో దివ్యాంగులైన చిన్నారుల బంగారు భవిష్యత్‌కు ఇవి ఎంతో భరోసాను ఇస్తున్నాయి. వారికి తగిన చేయూతనిచ్చి వైకల్యాన్ని జయించేందుకు మార్గం చూపుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా తగిన ఏర్పాట్లు చేశారు.
నిర్మల్ జిల్లాలోని భవిత (ఐఈఆర్సీ) కేంద్రాలకు చెందిన రిసోర్స్పర్సన్లు ఇంటింటికీ తిరిగి దివ్యాంగుల సమగ్ర అవసరాలను గుర్తించి వారిని కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 31 మంది ఐఈఆర్పీలు, నాలుగు ఫిజియోథెరపీలు, ఇద్దరు స్పీచ్థెరపీలు విధులు నిర్వహిస్తున్నారు. వీరు చిన్నారులకు వైద్యసేవలతో పాటు విద్యను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 18 భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు చేయూతనిస్తున్నారు. అయితే నాలుగు భవిత కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, మిగతా 14 భవిత కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. వారంలో ఒక రోజు ఫిజియోథెరపీ చేస్తున్నారు. మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన పిల్లలకు ఐఈఆర్పీలతో శిక్షణ ఇచ్చి వారు పూర్వస్థితికి వచ్చేలా ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 1307 మంది పిల్లలు వైకల్యంతో బాధపడుతున్నారు. వీరిని ప్రతి మండలంలోని భవిత కేంద్రాలలో పాఠశాల విద్యాశాఖ తరఫున ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శస్త్ర చికిత్స సైతం ఉచితంగా చేయిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఐఈఆర్పీలు ప్రతి కేంద్రానికి ఒక్కరు, ఇద్దరిని నియమించి అర్హులైన ఫిజియోథెరపిస్ట్‌లు వారానికి ఒకసారి, స్పీచ్థెరపిస్ట్లు రెండు వారాలకు ఒకసారి వచ్చి చికిత్స చేస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలో ప్రత్యేక కేర్ టేకర్‌ను నియమించి చిన్నారుల అవసరాల గుర్తిస్తున్నారు. ప్రతి ఐఈఆర్పీ ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థుల పరిస్థితిని గుర్తించి, వారి అభ్యసన ప్రవర్తనపై సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి తగిన సూచనలు చేస్తున్నారు. ప్రతి శనివారం పాఠశాలకు రాలేని దివ్యాంగ చిన్నారుల ఇళ్లకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఫిజియోథెరపీతో పాటు ప్రత్యేక ఉపకరణాల ద్వారా ఆటాపాటలతో మెలకువలు నేర్పిస్తున్నారు.
ఫిజియోథెరపీ చేసిన దివ్యాంగులకు ఒక విజిట్‌కు ఫిజియోథెరపిస్ట్‌కు రూ. 1000 చొప్పున నాలుగు వారాలకు రూ. 4000 ప్రభుత్వం ఇస్తుంది. మండల కేంద్రాల్లోని భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ చిన్నారులకు నెలకు రూ. 200 చొప్పున స్టెఫండ్ అలవెన్స్ కింద, నెలకు రీడర్ అలవెన్స్ కింద రూ. 60 చొప్పున అందిస్తున్నారు. అలాగే ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ కింద నెలకి ప్రతి ఒక్కరికి రూ. 500, ఎస్కార్ట్ అలవెన్స్ కింద రూ. 550 ప్రభుత్వం అందిస్తున్నది. ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా 285 మందిని గుర్తించి రూ. 20 లక్షల విలువ గల 410 మూడు చక్రాల సైకిళ్లు, రోలేటర్స్, హీయరింగ్ ఎయిడ్స్, ఎంఆర్ కిట్స్, క్లచ్చెస్స్, తదితర పరికరాలు ఉచితంగా అందించారు. గత ఏడాది జాతీయ ఉపకార వేతనాల ద్వారా 85 మందికి రూ. 9వేల చొప్పున అందించగా, ఈ ఏడాది 110 మంది దివ్యాంగులకు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. క్రమం తప్పకుండా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు సదరం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత బస్‌పాస్‌లను సైతం అందజేస్తున్నారు.
భవిత కేంద్రాలతోనే దివ్యాంగుల్లో మార్పు వస్తుంది. దివ్యాంగులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ జిల్లాలో 18 భవిత కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1307 దివ్యాంగులు ఈ కేంద్రాల్లో ఉన్నారు. వీరికి ఐఈఆర్పీల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించి దివ్యాంగులలో ఎంతో మార్పు వస్తోంది. దివ్యాంగుల పిల్లలను తీర్చిదిద్దేందుకు వారి నైపుణ్యాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది.
-రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ జిల్లా