ఇంద్రవెల్లి, జనవరి 21 : నాగోబా జాతరకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులకు సూచించారు. జాతరలో ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు. జాతరలోని అన్ని ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై ఆరాతీశారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్టాండ్, క్రీడామైదానం, వాహనాల పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్, పోలీస్ కంట్రోల్ రూం, భక్తుల క్యూలైన్లు, బారికేడ్లు, ప్రభుత్వ శాఖల స్టాల్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కదం సురేశ్, ఏపీవో ఆత్రం భాస్కర్, ఆలయ ఈవో రాజమౌళి, ఐటీడీఏ ఈఈ భీంరావ్, డీపీవో శ్రీనివాస్, ఏవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పర్యటించిన అధికారులు
నాగోబా ఆలయ పరిసరాల్లో ఆయా శాఖలకు చెందిన అధికారులు పర్యటించారు. ఏర్పాట్లతోపాటు అక్కడ వెలిసిన తినుబండారాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యతపై ఆరాతీశారు. పలు దుకాణాల్లోని వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష తనిఖీ చేశారు. వ్యాపారులకు పలు సూచనలు చేశారు. వస్తువులు నాసిరకంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీపీవో శ్రీనివాస్ జాతరలో పర్యటించి సమస్యలపై ఆరాతీశారు. కొనసాగుతున్న పారిశుధ్య పనులతోపాటు తాగునీటిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేసి శుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. పశువైద్యశాఖ ఆధ్వర్యంలో పశుగ్రాసం పంపిణీ చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి పశువులకు టీకాలు వేశారు. జాతరను పురస్కరించుకొని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందం ఆధ్వర్యంలో కంటి వెలుగు, రక్తహీనతతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.