“మంచిర్యాల నియోజకవర్గంలో గుండా రాజ్యం వద్దే వద్దు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటెస్తే అన్యాయం, అక్రమం తప్ప మరొకటి ఉండదు. కర్ఫ్యూలు.. గొడవలు లేని ప్రశాంతవాతావరణం కావాలంటే బీఆర్ఎస్ పాలనే ముద్దు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధిని ఇక్కడ మేము చేసి చూపించాం. ఈ యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే మరోసారి గులాబీ జెండానే ఎగరాలి. బంగారంలాంటి దివాకరన్న గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం. పార్టీ కోసం కార్యకర్తలు, నాయకు లు కష్టపడి పనిచేయాలి. మీ భవిష్యత్తుకు మాది భరోసా.” అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి నివాసానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి వెళ్లారు. ఎన్నికలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ బీ-ఫామ్‌లు ఇస్తారని, ఆపై ప్రచారం ఉధృతం చేసేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించుకున్నామని వారు తెలిపారు.
మంచిర్యాల, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలో గుండా రాజ్యం వద్దే వద్దని, బీఆర్ఎస్ పాలనే ముద్దు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి నివాసానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి విప్ వెళ్లారు. అరవిందరెడ్డితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి, ప్రజలను ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఆపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం కర్ఫ్యూలు.. గొడవలు లేకుండా ప్రశాంతవాతావరణంలో ఉండాలంటే మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. వ్యాపారులు, సామాన్య మధ్య తరగతి ప్రజలు వారి ప్లాట్ల కోసం పాట్లు పడకుండా ఉండాలంటే ఎమ్మెల్యే దివాకర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ అభ్యర్థులు, ఇన్చార్జిల సమావేశం నిర్వహిస్తున్నారని, అనంతరం బీ-ఫామ్‌లు ఇస్తారన్నారు. అది పూర్తయ్యాక 17వ తేదీ మంగళవారం నుంచి ప్రచార కార్యక్రమాలు ఉధృతం చేసేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించుకున్నామన్నారు. దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి కొన్ని బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల మరింత ప్రగతి సాధించాలంటే బీఆర్ఎస్ చేతిలోనే ఉండాలన్నారు. కచ్చితంగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని విజ్ఞులు, మేధావులు, పెద్దలంతా మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
మంచిర్యాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. మంచిర్యాల జిల్లా అయ్యిందని, మెడికల్, నర్సింగ్ కాలేజీలు వచ్చాయన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆయకట్టు స్థిరీకరించుకున్నామని, మొన్నటికి మొన్న హజీపూర్ మండలంలో రూ.85 కోట్లతో సుమారు 8వేల ఎకరాలకు సాగునీరిచ్చే ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించుకున్నామన్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 32 శాతం వాటా ఇవ్వడం, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించి పిల్లలకు సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదేనని తెలిపారు.. ఈ ఒక్క దసరా, దీపావళి బోనస్ కలిపి రూ.వెయ్యి కోట్లు కార్మికుల ఖాతాల్లో వేయబోతున్నామన్నారు. ఇప్పటికే రూ.2800 కోట్ల ఏరియర్స్ సింగరేణి కార్మికుల ఖాతాల్లో వేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాల హయాంలో జరగనంత అభివృద్ధి మంచిర్యాలలో జరిగిందన్నారు. ఈ అభివృద్ధి యజ్ఞం కొనసాగాలని, ఈ సంక్షేమ రాజ్యం కొనసాగాలని, ప్రశాంతమైన, శాంతియుతమైన వాతావరణంలో మంచిర్యాల ఉండాలన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, బ్రహ్మాండమైన వాతావరణంలో మంచిర్యాల ప్రజానీకం వ్యాపారాలు చేసుకొని సంతోషంగా బతకాలన్నారు. అలాంటి పరిపాలన కొనసాగాలంటే సౌమ్యుడు, అందరితో కులుపుగోలుగా ఉండే మా పార్టీ అభ్యర్థి దివాకర్ అన్నకు ఓటేసి మరొకసారి గెలిపించాలన్నారు. గతంలో 2018 ఎన్నికల్లో అందరం అరవిందరెడ్డి ఇంటికి వచ్చి భోజనాలు చేసి బయల్దేరి మంచిర్యాల గడ్డపై గులాబీ జెండా ఎగరేశామన్నారు. ఈ రోజు మళ్లీ ఇక్కడ కలుసుకొని ఉదయం అల్పాహారం చేసి బయల్దేరుతున్నామని, మరోసారి మంచిర్యాల గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరి భవిష్యత్తుకు మాది భరోసా అని చెప్పారు.
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ ఇన్-డైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తుందని వస్తున్న ఆరోపణలపై బాల్క సుమన్ స్పందించారు. బంగారంలాంటి మా దివాకర్ అన్న ఉండగా అవతలి వారు మాకెందుకు అంటూ ప్రశ్నించారు. మంచిర్యాలలో మా అభ్యర్థి దివాకర్‌రావు అని, ఆయన గెలుపే లక్ష్యంగా మేమంతా పని చేస్తామన్నారు. హై కమాండ్ ఆదేశానుసారమే అందరం ఇక్కడ కలిశామని, రానున్న రోజుల్లో మరిత ఉధృతంగా ప్రచారం చేస్తామన్నారు. అవతలి పార్టీ వారు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఈ పదేళ్లలో సింగరేణి కార్మికుల కోసం ఎంతో చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తుందన్నారు. 2014లో 16శాతం వాటా ఉంటే ఇప్పుడు 32 శాతం అయ్యిందన్నారు. నాకు తెలిసిన ఒక కార్మిక మిత్రుడికి రూ.1.60 లక్షల బోనస్ వచ్చిందన్నారు. పోయినసారి నాలుగు వేల మెజార్టీ ఇచ్చిన కోల్‌బెల్ట్ నుంచి ఈ సారి 20 వేల మెజార్టీ ఇవ్వాలన్నారు. మనందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నామని, కేసీఆర్‌కు కృతజ్ఞతగా దివాకర్‌రావుకు 20 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు టికెట్ ఇవ్వాలని తాను ప్రయత్నం చేశానన్నారు. కానీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన ఉందన్నారు. కచ్చితంగా మంచిర్యాలలో బీసీ మిత్రులు బలంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో వారికి మంచి అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గెలిచి సీఎం కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించుకున్నామని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బీసీ డిక్లరేషన్ అన్న కాంగ్రెస్ వాళ్లు, ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామన్నారన్నారు. కానీ ఈ రోజు మేం అలా చెప్పలేదు, ప్రజల్లో ఉన్న నాయకుడికే ఇస్తామని మాట మార్చారన్నారు. ఎలాంటి హామీ లేకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంథని, రామగుండం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇస్తామని దొంగమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. దయచేసి ఆ పార్టీ మాటలు నమ్మి మోసపోద్దని సూచించారు.
మంచిర్యాలలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంచిర్యాలలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకుంటున్నామన్నారు. పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే గూండా రాజ్యం వస్తుందని, అందుకే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కచ్చితంగా బీఆర్ఎస్కు ఓటు వేయాలనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు గంజాయి తాగిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన హైదరాబాద్‌లో క్లబ్ నడిపి, ఆ డబ్బు తీసుకువచ్చి ఇక్కడ వెదజల్లితే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. పొరపాటున ఆయనకు ఓటేస్తే అన్యాయం, అక్రమం, గుండాయిజం తప్ప మరొకటి ఉండదన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారన్నారు. టీబీజీకేఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి, మంచిర్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.