Fire accidents | నిర్మల్ అర్బన్, మే 7 : అసలే వేసవి కాలం.. ఆపై రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు బుగ్గేనంటూ హెచ్చరిస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. వ్యాపార, వాణిజ్య, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇళ్లల్లో ముందు జాగ్రత్తలతో పాటు నిబంధనలు పాటిస్తేనే మేలంటూ సూచిస్తున్నారు.
గతేడాది 203 ప్రమాదాలు
జిల్లా కేంద్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 203 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా భైంసాలో 74, అత్యల్పంగా నిర్మల్‌లో 57 కేసులు నమోదు కాగా, ఖానాపూర్‌లో 71 కేసు లు నమోదయ్యాయి. సుమారు రూ.2 కోట్ల 90 లక్షల ఆస్తి నష్టం జరిగింది. సకాలంలో స్పందించి మంటలు ఆర్పడం వల్ల దాదాపు రూ. 11 కోట్ల ఆస్తి బూడిద కాకుండా కాపాడారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే.. ఆర్పేందుకు కావాల్సిన పరికరాలు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారమందించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇటీవల జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్ కాలనీలో షార్ట్ సర్యూట్‌తో ఓ ఇంట్లో మం టలు చెలరేగాయి. పక్కపక్కనే ఉన్న రెండు ఇండ్లు కాలిపోయాయి. రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగింది. డాక్టర్స్ లేన్‌లోని ఓ వైన్స్‌లో ఇటీవల అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరుగగా, అధికారులు సకాలంలో స్పం దించడంతో ఆస్తి నష్టం తప్పింది. మంచిర్యాల చౌరస్తా వద్ద స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి ప్లాస్టిక్ సామగ్రి.. తదితర వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఇక నిత్యం ఏదో ఒకచోట గడ్డివాములు అగ్నికి ఆహుతవుతూనే ఉన్నాయి.
వెంటనే సమాచారం అందించండి
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిస్తే ప్రాణాలతో పాటు విలువైన ఆస్తిని కాపాడుతాం. కళాశాలలు, పాఠశాలలు, బహుల అంతస్తుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైరింజన్ వచ్చే వరకు మంటలను ఆర్పేందుకు యత్నించాలి. జిల్లాలో మూడు అగ్నిమాపక కేంద్రాలున్నాయి. నిర్మల్ ప్రాంతం వారు నం. 7981483939, భైంసా ప్రాంతం వారు నం. 8712699221, ఖానాపూర్ వారు నం. 8712699223లలో సంప్రదించాలి. చిన్న ప్రమాదాలను సైతం నివారించేందుకు మిస్స్డ్ ఫైర్ బుల్లెట్లను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫైరింజన్ వెళ్లలేని ప్రదేశాల్లో వీటిని వినియోగిస్తాం.
– జయంత్రామ్, ఫైర్ అధికారి